తెలంగాణ పోరాటం అనగానే మొదట గుర్తొచ్చే పేరు.. చాకలి ఐలమ్మ. దొరల అహంకారాన్ని, పెత్తనాన్ని సహించలేక తిరగబడ్డ వీరనారిగా చరిత్రకెక్కారు ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో ఐలమ్మ పుట్టారు. ఊరికి దగ్గరలోనే ఉన్న పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమెకు పెండ్లయ్యింది. ఐదుగురు కొడుకులు, ఒక బిడ్డ. వారికి రజక వృత్తే జీవనాధారం. భూమిని నమ్ముకుంటే ఆసరా అయితుందని ఐలమ్మ అనుకున్నారు. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు చెందిన 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. అయితే బడుగు కులానికి చెందిన ఐలమ్మ.. దొరల భూమిని సాగుచేయడం పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులు మొదలుపెట్టాడు. కుటుంబంతో వచ్చి తన పొలంలో కూలి చేయాలన్నాడు. అప్పటికి పాలకుర్తిలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ‘అణచివేతను ఎదిరించాలి’ అని మహాసభ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో పట్వారీ కింద పనిచేయడానికి ఐలమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందంటూ విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి పట్వారీ శేషగిరిరావు ఫిర్యాదు చేశాడు.
నాటి నల్లగొండలో భాగంగా ఉన్న విసునూరు పరిధిలో 60 గ్రామాలపై దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి పెత్తనం చేసేవాడు. రైతుల భూములను బుక్కపట్టేవాడు. అతని దారుణాలను ఆంధ్రమహాసభ అడ్డుకుంది. అలాంటి సంఘంలో చేరినందుకు ఐలమ్మ కుటుంబంపై దొంగ కేసులు పెట్టించాడు. ఆమె భర్త నర్సయ్య, కొడుకులు సోమయ్య, లచ్చయ్యను అరెస్ట్ చేయించాడు. సంఘం సాయంతో ఐలమ్మ కోర్టులో సవాల్ చేసి న్యాయం సాధించుకున్నారు.
కోర్టులో ఎదురుదెబ్బ తర్వాత ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీయడానికి దొర కుట్రపన్నాడు. ఆమె కౌలుచేస్తున్న మల్లంపల్లి భూస్వామి పొలాన్ని తన పేర రాయించుకున్నాడు. ఆరుగాలం పనిచేసి ఐలమ్మ పండించిన పంటను కోసుకురమ్మని మనుషుల్ని పంపించాడు. తన కష్టాన్ని వదులుకోవడానికి ఇష్టపడని ఐలమ్మ ఆంధ్రమహాసభ కార్యకర్తల సాయంతో పొలం దగ్గరే గుండాలను ఎదిరించింది. పంటను కోత కోసి ధాన్యాన్ని తన ఇంటికి తీసుకెళ్లింది. నాడు పంటకోసి బస్తాలు ఎత్తినవారిలో భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి నాయకులు కూడా ఉన్నారు. దీంతో తన పంటను కమ్యూనిస్టులు దోచుకెళ్లారంటూ దొర రామచంద్రారెడ్డి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఈసారి కూడా కోర్టులో న్యాయపోరాటం చేసి గెలిచారు ఐలమ్మ. లాయర్ గా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆమె న్యాయపోరాటంలో అండగా నిలిచారు.
రజాకార్లకు ఉపసేనానిగా ఉన్న దేశ్‌ముఖ్ ఒక మహిళ చేతిలో రెండుసార్లు ఓడిపోవడాన్ని భరించలేకపోయాడు. దీంతో రజాకార్లతో పాలకుర్తిలో దాడులు చేయించాడు. దొర గుండాలు ఐలమ్మ ఇంటికి అగ్గిపెట్టారు. ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ బిడ్డ సోమనర్సమ్మపై దాడి చేశారు. వారి దాడుల్లో ఐదుగురు చనిపోయాడు. అయినా ఐలమ్మ కుంగిపోలేదు. ధైర్యంగా దౌర్జన్యాలపై ఎదురుదాడి చేశారు. ఐలమ్మ రోకలిబండనే ఆయుధంగా చేసుకొని పోరాడారు. పట్వారీ శేషగిరిరావు ఇంటినే కూల్చేసి ఆ జాగాలో మక్కలు వేశారు. దొరను తరిమికొట్టి అతని భూములనే పేదలకు పంచారు. వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిన ఐలమ్మ నిరాడంబరంగా, రైతుగానే జీవించి 1985 సెప్టెంబర్ 10న కన్నుమూశారు. పాలకుర్తిలో ఆమెకు కమ్యూనిస్టు పార్టీ స్మారకస్థూపం నిర్మించింది. అయితే ఐలమ్మ వీరగాథ నాయకుల ప్రసంగాల్లో చెప్పుకోవడానికే పరిమితమైంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మన ట్యాంక్ బండ్ పై వీరనారికి సర్కారు చోటివ్వలేకపోయింది.