బిల్డర్లకు సంపూర్ణ సహకారం : డిప్యూటీ సీఎం భట్టి

బిల్డర్లకు సంపూర్ణ సహకారం : డిప్యూటీ సీఎం భట్టి
  • ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మిస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • హైదరాబాద్​ను గ్రీన్ సిటీగా మార్చేందుకు నిర్ణయించినం
  • రెవెన్యూ కంటే నగర ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
  • బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ లో భట్టి ప్రసంగం
  • గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పై  టీజీఐఐసీ, క్రెడాయ్ ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చాలా మంచిదని,  వీటిని నిర్మించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ డ్రీమ్​ప్రాజెక్ట్​ అయిన  ఫ్యూచర్‌ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం ఐజీబీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని నోవాటెల్‌లో  తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్​ను ప్రారంభించి, మాట్లాడారు. అంతకుముందు గ్రీన్ బిల్డింగ్ అంశంపై టీజీఐఐసీ ,  క్రెడాయ్ మధ్య ఎంవోయూ కుదిరింది.

 ఈ పత్రాలను టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి  మార్చుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ యంగ్ స్టేట్ అయినా.. చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ట్రాభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని డీజిల్ వాహనాలను దశలవారీగా ఈవీలుగా మారుస్తున్నట్టు తెలిపారు.  కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్​ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఢిల్లీలాంటి దుస్థితి రాకుండా హైదరాబాద్​ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.  గత పదేండ్లుగా రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లేదని,  అందుకే గ్రీన్ ఎనర్జీ పాలసీనీ రూపొందించామని చెప్పారు. 2029--–30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు తెలిపారు.  బిల్డర్లకు హైదరాబాద్ ప్యారడైజ్ లాంటిదని అన్నారు. 

బిల్డర్స్, డెవలపర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని,  వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు.  మూసీ పునర్జీవనం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి అని, దశాబ్ద కాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారని భట్టి గుర్తు చేశారు. ఈ నదిలో పరిశుభ్రమైన నీరు పారించి.. మూసీ నదిని హైదరాబాద్​కు ఒక వరంలా మారుస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  దావోస్​లో పర్యటించి..  రూ. 1.80 లక్షల కోట్ల ఇన్వెస్ట్​మెంట్స్​ను ఆకర్షించారని వివరించారు.  ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపించేందుకు కేవలం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్​ నగరానికి ఒక్క ఏడాదిలోనే రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు  భట్టి గుర్తు చేశారు. 

హైడ్రాతో లేక్స్​ను కాపాడుతున్నరు:  క్రెడాయ్ ప్రెసిడెంట్

హైడ్రా తీసుకొచ్చి లేక్స్ ను కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామని క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి నగరంలో ఉన్న చెరువులు,  కుంటలు కబ్జాకు గురవుతూ విస్తీర్ణంతోపాటు  వాటి సంఖ్య తగ్గుతున్నదని అన్నారు. నగర అభివృద్ధి కోసం  రూ. 10 వేల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణ నుంచి వెయ్యి ప్రాజెక్ట్స్  గ్రీన్ సర్టిఫికేషన్ కోసం ముందుకొచ్చాయని చెప్పారు.  ఇందుకోసం ఐజీబీసీ లో జాయిన్ అయ్యాయని తెలిపారు. గ్రీన్ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ లలోనూ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను అమర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.  గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను ఇన్షియేట్ చేస్తున్న నిర్మాణ సంస్థలకు రాయితీ కల్పించాలని రిక్వెస్ట్​ చేశారు.

గత ప్రభుత్వ వైఖరితో భారం పెరిగింది: సీఐఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 

గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను ప్రభుత్వం ప్రోత్సహించాలని సీఐఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్  రెడ్డి కోరారు. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో చాలా ట్యాక్స్ లు ఉన్నాయని, వీటిని తగ్గించాలని అన్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు వైఖరి వల్ల ప్రజలపై భారం పెరిగిందని,  ల్యాండ్ రేట్స్, మెటీరియల్ రేట్స్ భారీగా పెంచారని, దీంతో కొత్త ఇండ్లు కొనేవారికి ఆర్ధిక భారం పడిందని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్ కట్టేవాళ్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ఇలాంటి బిల్డింగ్ లు నిర్మించేందుకు వెయ్యి కంపెనీలు ముందుకు వచ్చాయని, ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని తెలిపారు.