- ఖరాబైన కూరగాయలు, పూలతో 700 యూనిట్ల కరెంట్
- బోయిన్‌పల్లిలో ఎల్పీజీ గ్యాస్కూడా తయారు చేస్తున్నరు
- నెలకు రూ.లక్షన్నర కరెంట్ బిల్లు ఆదా
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు, పూల వేస్టేజీతో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. బోయిన్ పల్లిలోని కూరగాయల మార్కెట్లో రోజుకు 10 టన్నులు, గుడిల్కాపూర్ లో కూరగాయలు, ఫ్లవర్స్ కలిపి ఐదు టన్నుల వరకు వేస్టేజీ జమవుతున్నది. వీటితో 700 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ఉత్పత్తి చేసి, దీన్నుంచి రోజుకు 700 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో కరెంట్ తో పాటు 30 కిలోల ఎల్పీజీ కూడా ఉత్పత్తి అవుతున్నది.
దీన్ని యార్డులోని క్యాంటీన్‌కు ఇస్తూ నెలకు రూ.50 వేల నుంచి రూ.80వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. రెండు మార్కెట్‌యార్డుల్లో ఉత్పత్తి చేసిన కరెంట్‌ను మార్కెట్ యార్డుల్లోని స్ట్రీట్ లైట్స్, దుకాణాలు, మార్కెట్ లో నీటి సరఫరాకు, యార్డుల్లోని క్యాంటీన్లలో, ఆఫీసుల్లో వాడుతున్నారు. ఇలా నెలకు దాదాపు రూ. లక్షన్నర కరెంట్ బిల్లు ఆదా చేస్తున్నారు. రెండు ప్లాంట్లలో 14 మంది ఉపాధి పొందుతున్నారు.
ఇలా తయారు చేస్తారు
సీఎస్ఐఆర్ఐఐసీటీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన అహుజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లలో ఈ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో భాగంగా మార్కెట్లలో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వేస్టేజీ నుంచి పవర్ఉత్పత్తి చేసే క్రమంలో కొన్ని దశలుంటాయి. ఇందులో భాగంగా ముందు కూరగాయలు, పూల వేస్టేజీని కన్వేయర్ బెల్ట్ మీదుగా క్రషర్ కు పంపిస్తారు. క్రషర్ లో ముక్కలైన వేస్ట్కన్వేయర్ కు అక్కడి నుంచి గ్రైండర్కు వెళ్తుంది. ఈ గ్రైండర్ వేస్టేజీని మరింత చూర్ణం చేస్తుంది. దీన్ని స్లర్రీ అని పిలుస్తారు.
ఈ చూర్ణం గాలి లేని డైజెస్టర్లకు పంపించి గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. తర్వాత గ్యాస్ బెలూన్లలో నిల్వ చేస్తారు. ప్రత్యేక ట్యాంక్‌లో బయోగ్యాస్ సేకరించి పైప్‌లైన్ ద్వారా జనరేటర్‌లోకి పంపిస్తారు. దీని ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యర్థాలతో వాయురహిత పద్ధతిలో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు. మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ను కలిస్తే బయోగ్యాస్ తయారవుతుంది. దీన్నుంచే ఎల్పీజీ, కరెంట్ ఉత్పత్తి అవుతుంది.
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంస
బోయిన్‌పల్లి మార్కెట్లో వెజిటబుల్, ఫ్లవర్ వేస్టేజ్ తో కరెంట్ఉత్పత్తి చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో అభినందించారు. తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన ఇక్కడ వ్యర్థాలను పడెయ్యకుండా కరెంట్ఉత్పత్తి చేయడానికి ప్రశంసించారు. ఎలాంటి కాలుష్యం లేకుండా స్యయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి వాడడం గొప్ప విషయమని కొనియాడారు.