ఇకపై కరెంట్ పోతే అంబులెన్స్​లు వస్తాయ్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇకపై కరెంట్ పోతే అంబులెన్స్​లు వస్తాయ్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • హైదరాబాద్​లో కరెంట్ ఇబ్బందులుండవు:  డిప్యూటీ సీఎం భట్టి
  • 1912కు డయల్  చేస్తే రిపేర్ చేసి వెళ్తరు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రేటర్ లో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు టీజీఎస్​పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్​ను నెక్లెస్​రోడ్​లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వర్షం పడి, చెట్టు విరిగి ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీబీడీ (సెంట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్ట పర్చేందుకు 57 డివిజన్లలో 57 స్పెషల్ వెహికల్​ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి వెహికల్​లో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు లైన్ సిబ్బంది, అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు.

కరెంట్ పోతే 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే సమస్య పరిష్కరిస్తాం’’అని భట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీలు ముషారఫ్ అలీ ఫారుఖీ, కర్నాటి వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.

వెహికల్ ఎలా పని చేస్తుందంటే..

వైద్య రంగంలో అంబులెన్స్ సేవల మాదిరి విద్యుత్ అంతరాయం కలిగిన చోట అత్యంత వేగంగా సమస్య పరిష్కరించడానికి ఈ వాహనాలను విద్యుత్​శాఖ ప్రవేశపెట్టింది. కరెంట్ పోయినప్పుడు 1912కి డయల్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత ప్రాంత సిబ్బందికి టీజీఏఐఎమ్ఎస్ యాప్ ద్వారా సమాచారం వెళ్తుంది.

డివిజన్​కు ఒక ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వెంటనే సమస్య ఉన్న చోటికి వెళ్లి పరిష్కరిస్తారు. టీజీఏఐఎమ్ఎస్ (అస్సెట్​మేనేజ్​మెంట్, ఇన్​స్పెక్షన్ అండ్ మెయింటనెన్స్​సిస్టమ్) యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. ట్రాన్స్ ఫార్మర్లను లాగేంత పవర్​తో ఈ వాహనాలను మాన్యు ఫ్యాక్చరీంగ్ చేయించారు.