తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బు, లాభాల సాగు..

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బు, లాభాల సాగు..

Oil Palm Farming: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు లాభాల బాటలో సాగుతున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం మంచి ధర పలకటం రైతులకు కలిసొస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2023 మార్చిలో టన్ను గెల రేటు రూ.14వేల 174 పలుకుతుండగా.. ప్రస్తుతం ఇది రూ.21 వేలకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లను రూ.8వేల 500 పెంచినట్లు వెల్లడించారు. దీంతో ఆయిల్ పామ్ సాగుచేస్తున్న దాదాపు 65వేల మంది రైతులకు లబ్ధి జరుగుతోందని మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో 14 కంపెనీలకు సాగుకోసం ఇచ్చిన అనుమతులతో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాలకు పంట విస్తరించిందనన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ దిగుమతులపై 27.5 శాతం సుంకాన్ని అమలు చేస్తుండటంతో స్థానికంగా పంటసాగు చేస్తున్న రైతులకు మంచి ధర పలుకుతోందని మంత్రి పేర్కొన్నారు.

రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు..
ఆయిల్ పామ్ పంటను సాగుచేస్తున్న రైతులకు ఒకపక్క మంచి గిట్టుబాటు ధర లభించటంతో పాటు మరోపక్క వారి ఖాతాల్లోకి సబ్సిడీ మెుత్తాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ జమ చేయటం సంతోషాన్ని నింపుతోంది. ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ కింద ఎకరాకు రూ.50 వేలకు పైగా ప్రోత్సాహకంగా అందిస్తోంది. అయితే ప్రస్తుతం రైతుల ఖాతాల్లోకి దీనికి సంబంధించిన మెుత్తాన్ని ప్రభుత్వం జమ చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయిల్ పామ్ తోటలను రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఇక్కడి రైతులకు సమయానికి సబ్సిడీ మెుత్తం జమ కావటం పెట్టుబడి కోసం ఆర్థికంగా అవసరమైన నిధులను కల్పిస్తోంది. తాజాగా ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీ చెల్లింపుల కోసం రూ.72 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45వేల 548 మంది రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ మెుత్తం జమయిందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో సైతం రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.