దసరాలోపే 317 జీవోపై నిర్ణయం

దసరాలోపే 317 జీవోపై నిర్ణయం
  • దశలవారీగా టీచర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి శ్రీధర్​బాబు

  •  కొత్త విద్యా విధానంపై ఆలోచన చేస్తున్నామని వెల్లడి

  • చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం

చేవెళ్ల, వెలుగు: 317 జీవో సమస్యలపై దసరా పండుగలోపే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్యంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని, త్వరలోనే టీచర్లకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. 317 జీవోతోపాటు పీఆర్సీ, డీఏ, జూలై నెల వేతనం..ఇతర సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఇండ్ల స్థలాలను కేటాయించే అంశాన్ని సీఎంకు నివేదిస్తామని చెప్పారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టడంతోపాటు డీఎస్సీ కూడా వేశామని, 9 నుంచి కొత్త టీచర్లు ఉద్యోగాల్లో చేరబోతున్నారని చెప్పారు. 

విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మాదిరిగా సర్కారు బడులు ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయని ప్రశ్నించారు. అక్కడ టీచర్లకు ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కూడా ఉండదని, డిగ్రీ, బీఈడీ, డైట్ చేసి.. డీఎస్సీ పాసై ఉద్యోగాలు సాధించిన టీచర్లు ఆ కోణంలో ఆలోచన చేయాలని కోరారు. దేశంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందని, అది ఎంతవరకు మన రాష్ట్ర పిల్లలకు లాభం చేకూరుస్తుందో ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సర్కారు బడులను అభివృద్ధి చేసేందుకు సబ్ కమిటీ నేతృత్వంలో ముందుకు వెళ్తామని తెలిపారు. 

రోడ్లకు నిధులు కేటాయించాలి: కాలె యాదయ్య

 టీచర్లు 317 జీవోతో ఇబ్బంది పడుతున్నారని, వీలైనంత తొందరగా వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. జిల్లాలో రోడ్లకు నిధులు కేటాయించి, బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్లకు రావాల్సిన రూ.540 కోట్ల మైనింగ్ గ్రాంట్ పెండింగ్​లో ఉందని, వెంటనే మంజూరు చేయాలని విన్నవించారు. మండలానికో మోడల్ స్కూల్ తెచ్చింది కాంగ్రెస్ సర్కారేనని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గౌరీ సతీశ్​, తదితరులు పాల్గొన్నారు.