నేతన్నకు సర్కారు చేయూత

  • అభయహస్తం నుంచి..వచ్చే నెల మూడు స్కీమ్స్​
  • యాదాద్రిలో 12,794 మంది కార్మికులకు ప్రయోజనం

యాదాద్రి, వెలుగు : చేనేత కార్మికులకు కాంగ్రెస్​ ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన మూడు స్కీమ్స్​తో యాదాద్రి జిల్లాకు చెందిన నేతన్నలకు పెద్ద ఎత్తున ప్రయోజనం దక్కనుంది. జిల్లాలో వ్యవసాయరంగం తర్వాత ఆ స్థాయిలో చేనేత రంగంలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయి. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 'తెలంగాణ అభయ హస్తం' పథకంలో నుంచి మూడు అనుబంధ స్కీమ్స్​ను ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమలు చేయనుంది. ఇందుకోసం స్టేట్ లెవల్​లో ప్రభుత్వం రూ.168 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్స్​ద్వారా జియో ట్యాగింగ్​కలిగిన మగ్గాలు, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం దక్కనుంది. 

జిల్లాలో వర్కింగ్ సొసైటీలు 8..

చేనేత రంగంలో యాదాద్రి జిల్లాది చెరగని ముద్ర. పోచంపల్లి పట్టు చీరలకు పెట్టింది పేరు. ఈ చీరలకు  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. చేనేత రంగంలో అనేకమంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. అయితే వీటిలో 8 సొసైటీలు మాత్రమే వర్కింగ్​లో ఉన్నాయి. ఈ సొసైటీల్లో వేలాది మంది మెంబర్లుగా ఉన్నారు. జిల్లాలో 5,410 మగ్గాలు జియో ట్యాగింగ్ కలిగి ఉండగా, మరో 1,362 టెంపరరీ ట్యాగింగ్​కలిగి ఉన్నాయి. 1,866 మరమగ్గాలకు జియో ట్యాగింగ్​ కలిగి ఉండగా మరో 370 మరమగ్గాలు టెంపరరీ ట్యాగింగ్​కలిగి ఉన్నాయి. చేనేత కార్మికులు, సహాయకులు కలిపి 11,688 ఉండగా, మరమగ్గాల్లో పని చేసే కార్మికులు 1,106 మంది ఉన్నారు. 

మూడు స్కీమ్స్..

చేనేత కార్మికుల సంక్షేమం కోసం సర్కారు చర్యలు తీసుకుంటోంది. కార్మికుల కోసం అమలు చేస్తున్న తెలంగాణకు నేతన్న పథకం గతంలో మూడేండ్ల కాలవ్యవధి ఉండగా, ఇప్పుడు రెండేండ్లకు కుదించారు. చేనేత కార్మికులు తమకు వచ్చే జీతంలో 8 శాతం జమ చేస్తే ప్రభుత్వం తన వంతుగా 16 శాతం జమ చేయనుంది. మరమగ్గాల కార్మికులు 8 శాతం జమ చేస్తే.. ప్రభుత్వం తన వంతుగా 8 శాతం జమ చేయనుంది. 

ఈ మొత్తం అమౌంట్​ను రెండేండ్ల తర్వాత కార్మికుల సేవింగ్​అకౌంట్​లో జమ చేస్తారు. తెలంగాణ నేతన్నలకు భద్రత స్కీమ్​లో 18 నుంచి 59 ఏండ్ల కార్మికులు మరణిస్తే ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు అందిస్తారు. 59 ఏండ్లు దాటిన వారు మరణిస్తే టెస్కో నామినికి రూ.5 లక్షలు అందిస్తారు. తెలంగాణ నేతన్న భరోసా స్కీమ్​లో చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.18 వేలు అకౌంట్​లో జమ చేస్తారు. సహాయకుడికి మాత్రం ఏడాదికి రూ.6 వేలు అందిస్తారు.