- పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.29,890 కోట్లు
- కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద మరో 15 వేల కోట్లు
- గత కొన్నేండ్లుగా రెగ్యులర్‌గా ఇస్తున్న వాటికీ కోతలు
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు హక్కుగా వచ్చే వాటాలే తప్ప.. ప్రత్యేక కేటాయింపులేమీ లేవు. కొత్త బడ్జెట్ ప్రకారం పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో రూ.45 వేల కోట్లు అందనున్నాయి. సెంట్రల్ జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్‌ల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 14.23 లక్షల కోట్లను పంపిణీ చేయనుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102 శాతం నిధులు.. అంటే రూ.29,890 కోట్లు తెలంగాణకు వస్తాయి.
నిరుడితో పోలిస్తే కేంద్ర పన్నుల వాటా రూ.3 వేల కోట్లు పెరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తున్న ట్యాక్స్ ఆదాయం పెరగడమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్రాలకు రూ.5.14 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణకు రూ.12 వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్ల దాకా వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధులు కూడా ఇందులోనే ఉంటాయి. ప్రధానంగా ఇండ్ల నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఫండ్స్‌ను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది.
ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క పైసా ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఫండ్స్వస్తాయా? రావా? అన్న క్లారిటీ లేదు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల గ్రాంట్లతోపాటు హెల్త్ గ్రాంట్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, ఇతర నిధులన్నీ కలిపితే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ రూ.3,400 కోట్ల మేర ఉండబోతున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,480 కోట్లు, అర్బన్ లోకల్ బాడీలకు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.800 కోట్ల మేర గ్రాంట్ రిలీజ్ కానున్నది. రెండింటికీ కలిపి రూ.2,280 కోట్లు వస్తాయి. ఇక హెల్త్ గ్రాంట్ కింద రూ.490 కోట్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద రూ.550 కోట్లు అందనున్నాయి.
రెగ్యులర్ కేటాయింపుల్లోనూ కోతలే
బడ్జెట్లో ఐఐటీ హైదరాబాద్, ట్రైబల్ వర్సీటీకి కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. వీటికి రెగ్యులర్ గా ఎంతో కొంత నిధులను కేంద్రం కేటాయించేది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, హైదరాబాద్ కు నిరుడు 73.68 కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్ లో కేవలం లక్ష రూపాయలతో సరిపెట్టింది. వాస్తవానికి రూరల్ డెవలప్మెంట్ఇన్స్టిట్యూట్లో వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు వాటన్నింటి పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కు గడిచిన మూడేండ్లుగా నిధుల్లో కోత పెడ్తున్నది.
2024–-25 లో రూ.122 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలాగే, ములుగులోని గిరిజన యూనివర్సిటీ (సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ) కి మరోసారి కేంద్రం ఎగనామం పెట్టింది. కొత్తగా నిర్మించబోయే ఈ యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్ అవసరం కాగా, దేశంలోని మిగిలిన ట్రైబల్ యూనివర్సిటీలకు ఇచ్చే నిధుల్లో నుంచే ములుగు యూనివర్సిటీకి కేటాయించనున్నట్టు పేర్కొన్నది. దీంతో వర్సిటీ భవనాల నిర్మాణం సందిగ్ధంలో పడింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) కు మాత్రం గతేడాదితో పోల్చితే రూ. 100 కోట్లు అదనంగా కేటాయించింది. 2024–25 లో రూ. 1600 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్ లో రూ. 1700 కోట్లకు పెంచింది. కాగా, కేంద్రానికి సింగరేణి సంస్థ ఏటా డివిడెండ్స్, ట్యాక్స్‌ల రూపంలో రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల దాకా చెల్లిస్తున్నది.