అవి ప్రభుత్వ భూములే.. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్​

అవి ప్రభుత్వ భూములే.. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్​
  • సుమారు 20 ఏండ్లుగా ఖాళీగా ఉండడంతో అడవిగా మారింది
  • ఏండ్ల తరబడి ఆ భూమి రెవెన్యూ పరిధిలోనే ఉంది 
  • అది ఫారెస్ట్ ​ల్యాండ్​ అని అటవీ శాఖ రికార్డుల్లో లేదు
  • అఫిడవిట్ తయారీని నేరుగా పర్యవేక్షించిన సీఎస్ శాంతి కుమారి 
  • రెండ్రోజులు ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో సమాలోచనలు

న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వ భూమేనని సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది. ఏండ్ల తరబడి ఆ భూమి రెవెన్యూ పరిధిలోనే ఉన్నదని వెల్లడించింది. సుమారు 20 ఏండ్లుగా ఖాళీగా ఉండడంతో అడవిగా మారిందని వివరించింది.  కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం రాష్ట్ర ప్రభుత్వం  అఫిడవిట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలతోపాటు అమికస్ క్యూరీ కోరిన వాటికి సమాధానాలు ఇందులో పొందుపరిచింది.  

న్యాయ వివాదం వల్ల ఏండ్ల తరబడి ఆ స్థలం ఖాళీగా ఉందని, ఆ క్రమంలో అక్కడ ఏపుగా చెట్లు పెరిగాయని, అది అడవి కాదని తెలిపింది.  హెచ్ సీయూ ఏర్పాటుకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, ఉమ్మడి ప్రభుత్వంలో ప్రైవేట్ వ్యక్తికి ఈ 400 ఎకరాలు కట్టబెట్టిన తీరు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం, తాజాగా ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా  న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఈ అఫిడవిట్ కు జోడించినట్టు తెలిసింది. అలాగే, అటవీ చట్టాలు, రాష్ట్రంలో ఇందుకు సంబంధించిన నిబంధనలు ప్రస్తావించినట్టు అధికార వర్గాల సమాచారం. 

నేరుగా రంగంలోకి సీఎస్ 

కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంపై ప్రతిపక్షాల రాద్దాంతం,  సుప్రీంకోర్టు నేరుగా తనను బాధ్యురాలిని చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి నేరుగా రంగంలోకి దిగారు. శని, ఆదివారాల్లో  ఢిల్లీలోనే మకాం వేసిన సీఎస్.. న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయవాదులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలంగా వినిపించాలని కోరారు.