
- భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్
- ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు
- అప్పీళ్లకు అవకాశం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు
- కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారాలు
- పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు చాన్స్
- భూరికాల్లో ఎలాంటి మార్పుల్లేవ్.. ధరణి డేటాతోనే భూభారతి
హైదరాబాద్, వెలుగు: భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్‌ను ప్రభుత్వం రిలీజ్చేసింది. భూసమస్యలకు ఎక్కడ? ఎలా? ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు.
ఫీల్డ్‌లో ఉన్న మేరకు భూమి రికార్డుల్లో చేరకపోతే, రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో తప్పు ఎంట్రీ ఉంటే.. భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్13 దాకా కరెక్షన్స్‌కు చాన్స్ ఇచ్చారు. ఇక గతంలో ఆర్‌ఓఆర్- 2020లో అప్పీళ్ల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్యులు సివిల్ కోర్టులపై ఆధారపడాల్సి వచ్చింది.
ఏ సమస్య అయినా రిజెక్ట్అయితే చాలు.. కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో లాయర్లకు ఫీజులు చెల్లించుకోలేక, కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడి తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సివిల్ కోర్టులు మొదలు హైకోర్టు దాకా కేవలం ధరణికి సంబంధించి 2 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు భూభారతి అమల్లో భాగంగా ఆర్‌డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకస్థాయిలో కాకపోయిన రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనుంది.
ఇక అప్పీళ్లు మాత్రమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును మార్గదర్శకాల్లో వెల్లడించారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ నివారించేందుకు కంప్యూటర్ రికార్డులతో పాటు మాన్యువల్ కాపీలను రెవెన్యూ కార్యాలయాల్లో భద్రపరుస్తారు. గతంలో ధరణిలో అనుభవదారుల (భూమిని అనుభవిస్తున్నవారి) వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. భూభారతి చట్టంలో వీరి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. దీంతో వారికి చట్టపరమైన రక్షణ లభించనుంది. 1936, 1948, 1971, 2020 భూచట్టాల్లోని లోపాలను సరిదిద్దేలా రూల్స్ ఉన్నాయి.
భూ రికార్డుల తయారీ, నిర్వహణ
రికార్డింగ్ అథారిటీ (తహసీల్దార్ లేదా నియమిత అధికారి) ప్రతి గ్రామంలోని అన్ని భూముల రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)ను తయారు చేసి నవీకరిస్తారు. ఆబాదీ (గృహస్థలాలు), వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రిజిస్టర్‌ను భూభారతి పోర్టల్‌లో నిర్వహిస్తారు.
ఆబాదీ, వ్యవసాయేతర భూముల సర్వే నిర్వహించి లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లతో భూమి సరిహద్దులను ఖరారు చేసి మ్యాప్‌లు తయారు చేస్తారు.
రికార్డుల తయారీ, నవీకరణ కోసం ప్రభుత్వం లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేస్తారు.
సాదా బైనామాల రెగ్యులరైజేషన్
12.10.2020 నుంచి 10.11.2020 మధ్య దరఖాస్తు చేసిన చిన్న, సన్నకారు రైతులు.. 02.06.2014కు ముందు రిజిస్టర్ కాని డాక్యుమెంట్ (సాదా బైనామాలు)తో12 ఏండ్లకు పైగా భూమిని అనుభవిస్తున్నవారు రెగ్యులరైజేషన్‌కు అర్హులు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీవో) నోటీసు జారీ చేసి దరఖాస్తుదారు, ట్రాన్స్‌ఫరర్, హక్కు కోరుతున్న పార్టీల నుంచి అఫిడవిట్, ఆధారాలు స్వీకరిస్తారు.
స్థానిక విచారణ, పొరుగు రైతులు, గ్రామ పెద్దల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటారు.
లావాదేవీ చట్టవిరుద్ధం కాదని నిర్ధారిస్తే, ఆర్‌డీవో 90 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి, రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. స్టాంప్ డ్యూటీ, రూ.100 పెనాల్టీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు.
ఇతర మ్యుటేషన్‌లు
కోర్టు ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, రెవెన్యూ కోర్టు ఆర్డర్, ప్రభుత్వ అసైన్‌మెంట్, భూదాన్, ఇనామ్ రద్దు, ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్, ల్యాండ్ అక్విజిషన్ కాంపెన్సేషన్ వంటి ఇతర మార్గాల ద్వారా హక్కులు పొందినవారు ఆర్‌డీవోకు దరఖాస్తు చేయవచ్చు.
ఆధారాలతో అఫిడవిట్, సర్వే మ్యాప్ (కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి) సమర్పించాలి.ఆర్‌డీవో నోటీసు జారీ చేసి, 7 రోజుల్లో ఆధారాలు స్వీకరిస్తారు. విచారణ తర్వాత 30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.
మ్యుటేషన్ ఆమోదమైతే, రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో మార్పులు చేసి పాస్‌బుక్ జారీ చేస్తారు.
భూధార్ కార్డు
రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో ఎంట్రీ ఉన్నవారికి వివాదాలు లేనట్లు నిర్ధారిస్తే తహసీల్దార్ తాత్కాలిక భూధార్ కార్డు జారీ చేస్తారు.కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి లైసెన్స్‌డ్ సర్వేయర్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌లతో భూమి సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రభుత్వ సర్వేయర్ దీన్ని ధ్రువీకరిస్తే, భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (భూధార్) ఇస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ భూధార్ కార్డు జారీ చేస్తారు.
పట్టాదార్ పాస్‌బుక్ జారీ
పాస్‌బుక్ కోసం భూభారతి పోర్టల్‌లో తహసీల్దార్‌కు దరఖాస్తు చేయవచ్చు. తహసీల్దార్ రికార్డ్ ఆఫ్ రైట్స్‌ను పరిశీలించి, ధ్రువీకరణ తర్వాత పాస్‌బుక్ జారీ చేస్తారు.తహసీల్దార్ స్వయంగా కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో ఉన్నవారికి పాస్‌బుక్‌లు జారీ చేయవచ్చు.పాస్‌బుక్‌లో తప్పులు ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ రికార్డులతో సరిపోల్చి సవరణలు చేస్తారు.
సర్టిఫైడ్ కాపీలు
రికార్డ్ ఆఫ్ రైట్స్, ఇతర పబ్లిక్ డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీల కోసం భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేయవచ్చు.తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కాపీలను జారీ చేస్తారు. ఇవి ఇండియన్ఎవిడెన్స్యాక్ట్-2023, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 ప్రకారం చెల్లుతాయి.
అప్పీళ్లు
చట్టంలోని సెక్షన్ 4(5), 4(6), 5(5), 5(9), 6(2), 7(2), 8(2), 9(2), 10(2) కింద జారీ చేసిన ఆర్డర్‌లపై అప్పీళ్లు చేయవచ్చు.
మొదటి అప్పీల్: తహసీల్దార్ ఆర్డర్‌పై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీవో)కు 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు. ఆర్‌డీవో ఆర్డర్‌పై కలెక్టర్‌కు 60 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు.
రెండో అప్పీల్: ఆర్‌డీవో ఆర్డర్‌పై కలెక్టర్‌కు, కలెక్టర్ ఆర్డర్‌పై ల్యాండ్ ట్రిబ్యునల్‌కు 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు.
రివిజన్ అథారిటీ
సీసీఎల్ఏ స్వయంగా లేదా దరఖాస్తు ఆధారంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎంట్రీలను సమీక్షిస్తారు. అధికారం దుర్వినియోగం, చట్టవిరుద్ధ నిర్ణయాలను సవరించి.. స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ఆర్డర్‌లు పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
పేదలకు న్యాయ సహాయం
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారు. లీగల్ సర్వీసెస్ అథారిటీల సహాయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వీలునామా, వారసత్వ మ్యుటేషన్
వీలునామా, వారసత్వం (ఇంటెస్టేట్ లేదా టెస్టమెంటరీ) ఆధారంగా మ్యుటేషన్ కోసం భూభారతి పోర్టల్‌లో తహసీల్దార్‌కు దరఖాస్తు చేయాలి. ఇంటెస్టేట్ వారసత్వం విషయంలో వారసులందరి నుంచి జాయింట్ అఫిడవిట్ సమర్పించాలి. సర్వే/సబ్-డివిజన్ మ్యాప్ (కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి) కూడా సమర్పించాలి.
తహసీల్దార్ నోటీసు జారీ చేసి, గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయంలో ప్రకటన ప్రచురిస్తారు. 7 రోజుల్లో అఫిడవిట్, ఆధారాలు సమర్పించాలి. తహసీల్దార్ రికార్డులను పరిశీలించి, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించవచ్చు.
30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఆర్డర్ జారీ కాకపోతే, దరఖాస్తుదారు పేరు డీమ్డ్ మ్యుటేషన్‌గా చేరుతుంది. మ్యుటేషన్ ఆమోదమైతే, కొత్త లేదా అప్‌డేట్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేస్తారు.
పార్ట్–-బీ కేసుల పరిష్కారం
ధరణిలో భూమి ఉన్నా పాస్‌బుక్‌లు రాని సుమారు 18 లక్షల ఎకరాల పార్ట్–-బీ కేసులను భూభారతి ద్వారా సరిచేసి, యజమానులకు పాస్‌బుక్‌లు జారీ చేస్తారు. ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త రికార్డులను రూపొందిస్తారు. భవిష్యత్తులో భూసర్వే కూడా చేయనున్నారు.
అక్రమాలపై కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు, పట్టా భూములను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే నిబంధనలు చట్టంలో ఉన్నాయి. నిషేధిత భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లను నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటారు.
రికార్డ్ ఆఫ్ రైట్స్ సవరణలు
ఆర్‌డీవో లేదా కలెక్టర్ రైతు చేసుకున్న దరఖాస్తుపై నోటీసు జారీ చేసిన తర్వాత, వ్యతిరేక పార్టీలు 7 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి . అధికారి విచారణ జరిపి, నోటీసు అందిన తేదీ నుంచి 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేయాలి. ఆర్డర్ జారీ అయిన 7 రోజుల్లో పార్టీలకు తెలియజేసి, భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి.
మిస్సింగ్ ఎంట్రీ (సర్వే నంబర్, డిజిటల్ సైన్), విస్తీర్ణంలో సవరణలకు సంబంధించి రూ.5 లక్షల లోపు మార్కెట్ విలువ ఉంటే ఆర్‌డీవో, రూ.5 లక్షలు పైబడితే కలెక్టర్ చేయాలి.
నేచర్ఆఫ్ప్రాపర్టీ సవరణ కలెక్టర్ చేయాలి. పేరు సవరణ అయితే పట్టా భూమికి ఆర్‌డీవో చేయాలి. అదే అసైన్డ్ ల్యాండ్ అయితే కలెక్టర్ చేయాలి.
నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చడం, పెండింగ్ మ్యుటేషన్లు ఆర్‌డీవో చేయాలి. ఇతర సవరణలు కలెక్టర్ లేదా సీసీఎల్ఏ నియమించిన అధికారి చేస్తారు.
ఫీజులు ఇలా..
రిజిస్ట్రేషన్: స్టాంప్ డ్యూటీ (రిజిస్ట్రేషన్ శాఖ శాతం ఆధారంగా)
మ్యుటేషన్/సక్సెషన్: ఎకరానికి రూ.2,500/గుంటకు రూ.62.50
పట్టాదార్ పాస్‌బుక్: రూ.300
రికార్డ్ సవరణ/అప్పీళ్లు: రూ.1,000
సర్టిఫైడ్ కాపీ: రూ.10
స్లాట్ రీషెడ్యూల్: మొదటిసారి ఉచితం, రెండోసారి రూ.500, మూడోసారి రూ.1,000
రికార్డుల సవరణ
హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే, రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది.
దరఖాస్తుదారు పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్, పహాణీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేదా ఇతర ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాలి.
సంబంధిత అధికారి దరఖాస్తుదారుకు, రికార్డుల్లో ఉన్న వ్యక్తులకు, హక్కు కోరే ఇతరులకు నోటీసులు జారీ చేస్తారు.
నోటీసు అందిన 7 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి. అభ్యంతరాలు లేకపోతే, మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
అధికారి భూరికార్డులను పరిశీలించి, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించవచ్చు. విచారణ జరిపి 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ఆర్డర్‌ను పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, పార్టీలకు తెలియజేస్తారు.