- కార్మికుల వాటా కింద 368 కోట్లు
- ఒక్కొక్కరికి రూ.80 వేలు!
- ఒకటో తారీఖు నుంచి పంపిణీ
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థకు పోయిన ఆర్థిక సంవత్సరం (2021–22) వచ్చిన లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మొత్తాన్ని దసరా లోపు కార్మికులకు చెల్లించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. పోయిన దసరాకు 29% వాటాను బోనస్ గా ఇవ్వగా, ఈసారి ఒక్క శాతం పెంచారు. 2021–22లో సింగరేణి రికార్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం టర్నోవర్ లో రూ.1,722 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇందులో పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3,596 కోట్లు చెల్లించింది. అవన్నీ పోను నికర లాభాలను రూ.1,227 కోట్లుగా నిర్ధారించింది. ఇప్పుడు ఇందులో 30 శాతం వాటా అంటే రూ.368 కోట్లను కార్మికులకు చెల్లించనుంది. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి వాటా చెల్లించనున్నారు. ఒక్కొక్కరికి రూ.80 వేలకు పైగా అందే అవకాశం ఉంది. కాగా, 2020–21లో సంస్థకు వచ్చిన లాభాల ఆధారంగా పోయినేడు దసరాకు కార్మికుల వాటా కింద రూ.79.7 కోట్లు మాత్రమే రాగా.. ఈసారి ఏకంగా నాలుగున్నర రెట్లు అధికంగా రావడం గమనార్హం.
70 మిలియన్ టన్నుల లక్ష్యం: సీఎండీ శ్రీధర్
2021–22లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అదే విధంగా 655 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 88.08 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది. 2022–23లో నిర్దేశించుకున్న టార్గెట్ 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. సింగరేణి కార్మికులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.