- రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బండ్లు రయ్ రయ్
- ఇప్పటివరకు 1.7 లక్షల వెహికల్స్ రిజిస్ట్రేషన్ పూర్తి
- ఈవీ వాడకాన్ని పెంచడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగు పరచడంపై ప్రభుత్వం ఫోకస్
- తయారీ కంపెనీలకు హబ్‌గా ఎదగడమే టార్గెట్
బిజినెస్‌డెస్క్, వెలుగు: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాడకం పెరుగుతోంది. ఇప్పటివరకు 1.7 లక్షల ఎలక్ట్రిక్ బండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీవీలర్ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్‌లో 100 శాతం మినహాయింపును ప్రకటించింది. అంతేకాకుండా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది. కస్టమర్లకు, వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి రాష్ట్రం మొత్తం మీద 3 వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. వీటిని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నెలకొల్పనుంది. మాల్స్, ఎయిర్‌పోర్ట్స్, రైల్వే స్టేషన్ వంటి పబ్లిక్ ప్లేస్‌లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఛార్జింగ్ వేగంగా జరిగేలా చూసేందుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
ఈవీ సేల్స్ జూమ్..
తెలంగాణలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 30,322 ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడయ్యాయి. ఇదే టైమ్‌లో 2,386 ఈ–ఫోర్ వీలర్లు, 44 ఈ–బస్సులు, 100 ఈ– లైట్ కమర్షియల్ వెహికల్స్, సుమారు 2,200 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ అమ్ముడయ్యాయని ఈవీరిపోర్టర్.కామ్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, ఏథర్ ఎనర్జీ, ఆటుమొబైల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, క్వాంటమ్ ఎనర్జీ, ఆడమ్స్ మార్కెటింగ్, బీగాస్ ఆటో, షెమా ఈవెహికల్స్, యాంపియర్ వంటి కంపెనీలు రాష్ట్రలో ఎలక్ట్రిక్ టూవీలర్లను, బజాజ్ ఆటో, మహీంద్రా లాస్ట్ మైల్, పియాజియో, కెటో మోటార్స్, ఒమెగా సైకి వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ త్రీవీలర్లను విక్రయిస్తున్నాయి.
ఈవీ తయారీ ప్లాంట్‌లు..
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ–సిటీ ఈఎంసీని ఏర్పాటు చేసింది. కంపెనీలు వెంటనే ఇక్కడ తమ తయారీని మొదలు పెట్టొచ్చు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లే స్పేస్‌ను క్రియేట్ చేయాలని, పీపీపీ మోడల్‌లో అదనంగా 10 లక్షల చ.అ. స్థలాన్ని రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు ఒలెక్ట్రా, ఈట్రియో, ఈ–రైడ్, ఆటుమొబైల్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను రాష్ట్రంలో తయారు చేస్తున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా తమ అసెంబ్లింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్!
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు ప్రకటించడంతో ఈవీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం ఒక్కరోజే 131 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరిగినట్టు ఆర్టీఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్‌కుమార్ తెలిపారు. ఇందులో అధిక శాతం హైదరాబాద్‌లో జరిగినవేనని అన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయానికి వస్తే ఆటో రిక్షాలు 3, గూడ్స్ క్యారియర్ 1, మోటార్కార్ 6, మోటార్ సైకిళ్లు 121 ఉన్నట్టు ఆయన తెలిపారు.