
హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికులకు రూ.లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.33 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇస్తూ హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదివారం జీవో 56 జారీ చేశారు. ఈ సందర్భంగా చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వంలో చిన్నచూపునకు గురైన చేనేత రంగాన్ని ఏడాదిలోనే తమ ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు పలు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలు/సంస్థలు/సమాఖ్యలు టీజీ టెస్కొ నుంచి దుస్తుల కొనుగోలు చేసేలా గతేడాది మార్చి 11న జీవో జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. నేతన్నలకు నిరంతర ఉపాధి కలిగించడమే కాకుండా, వారి జీవనోపాధి మెరుగుపర్చడానికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తున్నామని మంత్రి తెలిపారు. నేతన్న చేయూత పథకం ద్వారా రూ.290.09 కోట్లు విడుదల చేసి, 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు.