నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు

నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
  • నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు
  • ప్రస్తుత లిస్టుల్లో పేరులేని వాళ్లు దరఖాస్తు చేసుకునే చాన్స్​
  • గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ ​చేసిన ఆఫీసర్లు
  • ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అప్లై చేసుకోవచ్చు
  • అర్హులందరికీ స్కీములు వర్తిస్తాయి.. ఆందోళన వద్దన్న సర్కారు
  • గ్రామసభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న ఉన్నతాధికారులు 
  • క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం

హైదరాబాద్, వెలుగు : నాలుగు స్కీములకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి ఈ నెల 24 దాకా వీటి నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏ రోజు ఏ టైంలో అప్లికేషన్లు తీసుకుంటారో గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు. గ్రామ, వార్డు సభలతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లోనూ అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ  ఇండ్లు.. స్కీములను ప్రభుత్వం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అర్హుల లిస్టులు ఆయా గ్రామాలు, వార్డులకు చేరాయి. కొన్నిచోట్ల తమ పేర్లు రాలేదని అర్హులు ఆందోళన చెందుతుండగా, వారికి మరో అవకాశమివ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 

అలాంటివారి నుంచి గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరించాలని ఆఫీసర్లను ఆదేశించింది. ఈ మేరకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి సైతం దరఖాస్తులు తీసుకుంటారు. ఒకే కుటుంబం నుంచి వేరుపడ్తున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు కూడా స్వీకరిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం సైతం అర్హులు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఒకేరోజు నాలుగు పథకాల అమలు

ఈ నెల 26 న నాలుగు స్కీములు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హుల ఎంపికలో ఆఫీసర్లు తలమునకలయ్యారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతుబంధు వచ్చిన గుట్టలు, క్వారీలు, వెంచర్లు, సాగుయోగ్యంకాని భూములు, ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములను కొత్తగా అమలుచేయనున్న  రైతు భరోసా స్కీము లిస్టు నుంచి తొలగించనున్నారు. ఇందులో భాగంగా సర్కారు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 19 దాకా ఊరూరా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు ఆ లిస్టు ఫైనల్ చేశారు. ఇక గ్రామాలు, మున్సిపాలిటీలవారీగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ  ఇండ్ల పథకాల కోసం ఇప్పటికే అర్హుల లిస్టులను ఆఫీసర్లు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్​కార్డులు లేని వారి జాబితాలను సైతం రూపొందించారు. 

ALSO READ : స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు..సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు

కానీ ఆయా లిస్టుల్లో అనర్హుల పేర్లు వచ్చి, అర్హుల పేర్లు మిస్సయ్యాయని పలుచోట్ల జనం ఆందోళనకు దిగారు. దీంతో తాజాగా  నిర్వహించనున్న గ్రామసభల్లో కొత్త అప్లికేషన్లు తీసుకోవడం తోపాటు ఇప్పటికే రూపొందించిన లిస్టుల్లో అనర్హులను తొలగించేందుకు వెరిఫికేషన్​చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం లబ్ధిదారుల ఎంపికలో కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో ఉపాధిహామీ కూలీల ఆధార్ నంబర్ల నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి రావడంతో డాటా ఎంటర్  చేయడంలో జరిగిన పొరపాట్లను సవరించాలని ఇప్పటికే డీఆర్డీవోలను ఆదేశించారు. 2023-–24 లో ఈజీఎస్ లో కనీసం 20 రోజుల  పనిదినాలు పూర్తి చేసుకున్న వారికి కుటుంబం యూనిట్ గా ఈ పథకం అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ పేరిట బ్యాంకు ఖాతాలో భరోసా నిధులు జమ చేస్తారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలకు అర్హత ఉంటే.. పెద్ద వయస్కురాలి బ్యాంకు ఖాతాలోకి నిధులు జమ కానున్నాయి. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద ఖాతాలోకి వెళ్తాయి.

క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ..

కాగా, నాలుగు స్కీములకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, లిస్టుల వెరిఫికేషన్​ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మంత్రులు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల గ్రామసభలను పర్యవేక్షించాలని సీఎస్​శాంతి కుమారి ఆదేశించారు.  మంగళవారం నుంచి 24 వరకు గ్రామ సభలు జరగనుండగా, నాలుగురోజులపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను స్వయంగా పరిశీలించి, లోటుపాట్లు ఉంటే వెంటవెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. కాగా, గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున అక్కడే లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శింంచి, ప్రజల సమక్షంలోనే లిస్టులు ఫైనల్​చేస్తామని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు చెప్పారు.