1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు

 1.49 కోట్ల ఎకరాలు..  8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
  • ఎకరాకు రూ.6 వేలచొప్పున పెట్టుబడి సాయం
  • 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ
  • నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు 
  • సాగుకు యోగ్యంకాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తింపు 
  • వాటి సర్వే నంబర్లు ఆన్​లైన్​లో బ్లాక్

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్​కు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల 
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి, ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్​లైన్​లో బ్లాక్​ చేస్తున్నారు.

ఈ భూములు మినహాయించి, మిగిలిన అన్ని వ్యవసాయ భూములకు విడతల వారీగా రైతు భరోసా అందించనున్నారు. గత సీజన్​వరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా,  ఈసారి ఎకరాకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నెల 26న సీఎం రేవంత్​రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఫీల్డ్ సర్వేతో గుర్తింపు.. 

ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం దాదాపు కోటి 53 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములుగా నమోదై ఉన్నాయి. దాదాపు 69 లక్షల మంది పట్టాదారులుగా ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సాగుకు యోగ్యంకాని భూములు కూడా ఉన్నాయి. వాటిలో ఎటువంటి పంటలు పండే పరిస్థితి లేదు. ఇలాంటి వాటికి రైతు భరోసా ఇవ్వకూడదని కేబినెట్​లో  నిర్ణయించారు. అందులో భాగంగానే వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ భూముల సర్వే నెంబర్లను గుర్తించారు. పెట్రోల్‌‌‌‌ బంకులు, ఫంక్షన్‌‌‌‌ హాళ్లు, పార్కింగ్‌‌‌‌ స్థలాలతో పాటు కొండలు, రాళ్లు, రప్పలు ఉన్న భూములకూ  గత ప్రభుత్వం రైతుబంధు అందించినట్టు తేల్చారు. 

వీటితో పాటు రోడ్లు, హైవేలలో పోయిన భూములకు సైతం రైతుబంధు జమ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి భూములను సర్వే నెంబర్ల వారీగా గుర్తించి.. గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఏయే సర్వే నెంబర్లలో వ్యవసాయ యోగ్యంకాని భూములు ఉన్నాయో చదివి వినిపిస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఆన్​లైన్​లో బ్లాక్​చేస్తున్నారు. ప్రాథమికంగా తేలిన లెక్కల ప్రకారం ఇలా సాగుకు పనికిరాని భూములు 3 లక్షల ఎకరాల నుంచి మూడున్నర లక్షల ఎకరాల మధ్య ఉన్నాయి. అవిపోను కోటి 49 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా అందుతుందని వ్యవసాయ, రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. 

విడతల వారీగా జమ..  

రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకున్నది. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర సేకరించింది. ఇందులో రైతు భరోసాకు అవసరమైన రూ.8,900 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగే విడతల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనుంది. ఎకరాకు రూ.6 వేల చొప్పున కోటి 49 లక్షల ఎకరాలకు ఇస్తే రూ.8,900 కోట్లు అవుతున్నది.

గతంతో పోలిస్తే ఇది దాదాపు రూ.1,500 కోట్లు ఎక్కువ. ఏయే గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల డిజిటల్​బ్లాకింగ్​పూర్తయిందో, ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూములున్న రైతులకు ఈ నెల 26న పెట్టుబడి సాయం అందనుంది. ఇలా విడతల వారీగా పూర్తి స్థాయిలో నిధులను 15 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

అయితే టీజీబీలో ఏపీజీవీబీ విలీనం నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తే టెక్నికల్​సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఒకవేళ ఈ నెల 25 కల్లా ఆ బ్యాంకు నుంచి క్లారిటీ వస్తే ఆ మరుసటి రోజు యథావిధిగా నిధులు జమ చేస్తామని, లేదంటే ఆ ఖాతాదారులకు తర్వాత జమ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.