ఇక పుల్ కిక్కే.. తెలంగాణలోకి దేశీయ, విదేశీ లిక్కర్ బ్రాండ్లు

ఇక పుల్ కిక్కే.. తెలంగాణలోకి  దేశీయ, విదేశీ లిక్కర్ బ్రాండ్లు
  • మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం 
  • విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తుల ఆహ్వానం
  • రిజిస్టర్‌‌ కాని కొత్త సప్లయర్స్‌‌ నుంచి అప్లికేషన్స్​

హైదరాబాద్, వెలుగు: మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ (టీజీబీసీఎల్‌‌) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలో రిజిస్టర్‌‌ కాని కొత్త సప్లయర్స్‌‌ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్​ ఇచ్చింది.  

కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను 10 రోజులపాటు ఆన్ లైన్ లో పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకున్నది. దరఖాస్తుల  అభ్యంతరాలపై విచారణ జరిపి.. అనంతరం అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నది. టీజీబీసీఎల్ లో నమోదై సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 

నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్‌‌ సర్టిఫికేషన్‌‌ 

రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతోపాటు సెల్ఫ్‌‌ సర్టిఫికేషన్‌‌ జతపరచాలని టీజీబీసీఎల్‌‌ తెలిపింది. రాష్ట్రంలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల టీజీబీసీఎల్ అనుమతులు ఇచ్చింది. కానీ పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసింది.

ఆ తర్వాత బీర్ల ధరలను 33.1 శాతం పెంచాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. యూబీఎల్ కంపెనీ ఒత్తిడి చేసిన అంశంపై సీఎం  రేవంత్ రెడ్డి రివ్యూ చేసి.. కంపెనీల ఏకఛత్రాధిపత్యం కుదరదని.. కొత్త కంపెనీలకు ఆహ్వానం పలకాలని, అందుకు విధి విధానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి నాంది పలికింది.