- పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు రూ.1,784 కోట్లు
- పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డిండి లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌ను సర్కారు ప్రాధాన్యంగా తీసుకున్నది. అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే కాంపొనెంట్లకు బుధవారం రూ.1,800 కోట్లు మంజూరు చేసిన సర్కారు.. తాజాగా డిండి నుంచి శివన్నగూడెం వరకు చేపట్టే పనుల కోసం రూ.6,190 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ఈ మేరకు గురువారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. 2015లో ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.4,500 కోట్లతో అంచనాలను తయారు చేయగా.. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.6,190 కోట్లకు అనుమతులిచ్చారు. అయితే, ఇంతకుముందు శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసేలా డిండి ప్రాజెక్టును డిజైన్ చేయగా.. ఇప్పుడు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టుగా మాడిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నార్లాపూర్‌కు రూ.1,784 కోట్లు..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులనూ సర్కార్ స్పీడప్ చేయనుంది. అందులో భాగంగా ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు రూ.1,784 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ2లో భాగంగా చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు వేరియేషన్ ఎస్టిమేట్స్‌కు ఆమోదం తెలిపింది. నాగర్కర్నూల్సీఈకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా, సింగూరుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి సిలారపు రాజనర్సింహ సింగూరు కెనాల్స్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.