- ఒకటీ, రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పౌజ్ టీచర్ల బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పంపించిన ప్రతిపాదనల ఫైల్ పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీంతో ఒకటీ, రెండు రోజుల్లో అధికారికంగా విద్యాశాఖ ఉత్తర్వులు రిలీజ్ చేయనున్నది. గత ప్రభుత్వం జీవో 317 ఇవ్వడంతో చాలామంది భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. స్పౌజ్ కేటగిరీలో కొందరికి న్యాయం జరిగినా.. ఇంకొందరిని మాత్రం ఒకే జిల్లాకు అలాట్ చేయలేదు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో, స్పౌజ్ బాధిత టీచర్లు సర్కారుకు సమస్యను విన్నవించారు. దీంతో ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కేబినేట్ సబ్ కమిటీలో దీనికి ఆమోదం తెలిపడంతో.. ప్రక్రియ వేగంగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో 834 స్పౌజ్ టీచర్లకు లబ్ధి చేకూరనున్నది.
మ్యూచువల్ టీచర్ల బదిలీలపైనా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని డీఈఓలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాగా, స్పౌజ్ బదిలీల ఫైల్ పై రేవంత్ రెడ్డి సంతకం పెట్టడంపై పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.