తాగునీటికోసమే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు..సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదన

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమని, ఈ స్కీంతో  రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అలాంటప్పుడు మళ్లీ తాగునీటి కోసమే రూ. 35,200 కోట్లతో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తుంది? ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 22 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగింది.  ప్రతిపాదిత 90 టీఎంసీలకు బదులు తాగునీటికి 9 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తీసుకోవడానికి మాత్రమే సుప్రీంకోర్టు తాజాగా అనుమతి ఇచ్చింది. ఇప్పటిదాకా చేపట్టిన పనులన్నీ 90 టీఎంసీల ఎత్తిపోతలను దృష్టిలో ఉంచుకొని జరిగాయి. ఇప్పుడు కేవలం తాగునీటికి 9 టీఎంసీలు మాత్రమే వాడాలంటే జరిగిన దుబారా ఖర్చుకు బాధ్యులెవరు?

ఉ మ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి కోసం జూరాల ప్రాజెక్టు నుంచి వరద కాలంలో నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవాలని, దానికి కావాల్సిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్ సీఐ)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఆ మేరకు ఈఎస్ సీఐ సమగ్ర సర్వే జరిపి ప్రాజెక్టు రిపోర్టును 2014లో ప్రభుత్వానికి సమర్పించింది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కాలంలో 70 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా సేకరించి సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చని ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నది. దీనిపై 2015 ఏప్రిల్​28న సీఎం ప్రాజెక్టు స్థలాన్ని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి ఇంకో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత సమయాభావం వల్ల ఈఎస్ సీఐ వారి కార్యాలయంలోనే మ్యాపుల ద్వారా రెండు వారాల్లో డీపీఆర్ తయారు చేసింది. ఆ రిపోర్టులో రెండు ఆప్షన్లు ఇచ్చింది. అదే ఏడాది మే 21న నిర్వహించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్​ మొదటి ఆప్షన్​కు అనుమతి తెలిపారు. దాని ప్రకారం శ్రీశైలం నుంచి వరద సమయంలో 90 టీఎంసీల నీటిని 5 ఎత్తిపోతల ద్వారా తీసుకొని,10 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాదు నగరానికి తాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీటిని అందించాలనేది లక్ష్యం. దీనికి అయ్యే ఖర్చు రూ.35,200 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం.. 2015 జూన్​10న జీవో నెం 105 విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. 48 నెలల్లో అంటే జూన్ 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో 18,346 ఎకరాల భూమి ముంపునకు గురి అవుతుంది. ప్రాజెక్టు పనిని 21 ప్యాకేజిలుగా విభజించి వర్క్​ ప్రారంభించారు. ప్రతిపాదిత ఐదు లిఫ్టులకు సుమారు 
4,560 మెగావాట్ల విద్యుత్తు అవసరమని అంచనా వేశారు.

అవినీతికి ఆస్కారం

నీటి కేటాయింపులు చేయకుండా, పర్యావరణ అనుమతులు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్టుకు రకరకాల అడ్డంకులు మొదలయ్యాయి. ఒకటి తరువాత ఒకటిగా తప్పులతో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ఒక గుదిబండగా తయారైంది. పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. పర్యావరణ అనుమతి లేదని ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. భూనిర్వాసితుల నుంచి మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డజనుల కొద్దీ కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి.  మోటారు పంపుల కొనుగోలులో అవినీతి జరిగిందని సుప్రీం కోర్టులోనూ కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా ప్రాజెక్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పదవీ విరమణ పొందిన ఇంజనీర్ల చేతుల మీద ప్రాజెక్టు పని జరుగుతుందని, వారికి ఎటువంటి బాధ్యతలు లేకపోవడంతో భారీగా అవినీతికి ఆస్కారం ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నీటి కేటాయింపులు లేవని ఎన్జీటీలో ఫిర్యాదు చేయడం, పర్యావరణ అనుమతులు వేని కూడా కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో అనుమతులు తీసుకునే వరకు పనులు ఆపాలని 2021 అక్టోబర్​లో ఎన్జీటీ ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలని లెక్క చేయకుండా పనులు కొనసాగించింది. 2022 డిసెంబర్​22న మళ్లీ స్పందించిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్​ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందని, రూ.920 కోట్ల జరిమానా విధించింది. “ తెలంగాణ ప్రభుత్వానికి పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టడం ఒక దురలవాటుగా ఉంది. దాన్ని సమర్థించుకోవడానికి మేము ప్రజల ఉపయోగార్థమే ఈ ప్రాజెక్టు కడుతున్నామని వాదించడం విచిత్రంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తున్నప్పుడు మళ్లీ, పాలమూరు రంగారెడ్డి జిల్లాల తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు కడుతున్నామని తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని 920 కోట్ల రూపాయలు జరిమానా వేశాం”అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్జీటీ సహా, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన కేసులు అనేకం పెండింగులో ఉన్నాయి. ఇంతలో ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనబడటం లేదు. పనిలో ఆలస్యం కావడంతో ప్రాజెక్టు అంచనాలు రూ. 35,200 కోట్ల నుంచి రూ. 57 వేల కోట్లకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి.


మోటారు పంపుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపకుండా ఉండటం అవినీతికి ఊతమిచ్చినట్లే కదా? ప్రాజెక్టు పనిలో ఎలాంటి పారదర్శకత లేదు. డీపీఆర్ కాపీ అడిగినప్పుడు రూ. 28,500 చెల్లించమని అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు రకరకాల విమర్శలకు గురి అవుతున్నప్పుడు ప్రజలకు అన్ని విషయాలు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? డీపీఆర్​ను నీటిపారుదల శాఖ వెబ్​సైట్​లో ఉంచినా ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా! కొందరు విశ్రాంత ఇంజనీర్లు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ప్రాజెక్టు పని అతి గోప్యంగా చేయడంతో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎన్జీటీ తీర్పుపై ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. కోర్టు ట్రిబ్యునల్ విధించిన జరిమానాపై ‘ స్టే’ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు తప్పుడు అఫిడవిట్​తో ఈ ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసం నిర్మిస్తున్నామని, తాగునీటి కోసం నిర్మించే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలిపింది. దీంతో ప్రతిపాదిత 90 టీఎంసీలకు బదులు తాగునీటికే 9 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తీసుకోవడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మంజూరు ఇచ్చేటప్పుడు దాని ఖర్చు, జరిగే లాభం ఉజ్జాయింపు(బెనిఫిట్ కాస్టు అనాలసిస్) జరగాలి. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎకరాకు నీరు ఇవ్వడానికి రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు క్యాపిటల్ కాస్ట్, సాలీన విద్యుత్, ఇతర ఖర్చులకు ఎకరాకు 20,000 రూపాయల వరకు అవుతుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, సాలీన కట్టే వడ్డీ వివరాలు, ప్రాజెక్టుకు కావాల్సిన 4,560 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారన్న విషయాలపై స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో నీటి కేటాయింపులు లేని పర్యావరణ అనుమతులు లేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలు పెట్టి ప్రజాధనాన్ని వృథా చేసింది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు అవసరం.

గుడ్డెద్దు చేనులో పడినట్లు

ఈఎస్ సీఐ సమగ్ర సర్వే జరిపి జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డీపీఆర్​ రెడీ చేస్తే, సీఎం కేసీఆర్​ దాన్ని కాదని, శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని సూచించారు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై నిష్ణాతుల రిపోర్టు కాదని రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరైనదేనా? ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాలని కేసీఆర్​ఆదేశించినప్పుడు.. సరైన సమగ్ర సర్వే జరిగి డీపీఆర్ తయారు కావాల్సి ఉండే. కానీ అందుకు భిన్నంగా కార్యాలయంలోనే మ్యాపుల(పటాల) ఆధారంగా ఆదరాబాదరగా 2 వారాల్లో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవడానికి డీపీఆర్​సిద్ధమైపోయింది. అయితే ఆ ఇంజనీర్లు తమపై ఎలాంటి బాధ్యత ఉంచుకోకుండా, సీఎం ముందు ఆప్షన్లు ఉంచారు. వారు సాంకేతిక విషయాలు దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోకుండా దాన్ని ముఖ్యమంత్రికి వదిలేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. పర్యావరణ, ఇతర అనుమతులు లేకుండా మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టు పనికి మూడు ఎస్ఈ సర్కిల్స్ పనిచేస్తున్నాయి. సంబంధిత ఇంజనీర్లకు పర్యావరణ అనుమతుల గురించి ఏమీ సమాచారం లేదు. గుడ్డెద్దు చేనులో పడినట్లు పనులు చేసుకుంటూ పోతున్నారు.


- ఎం. పద్మనాభరెడ్డి కార్యదర్శి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్