116 టీఎంసీలు కావాలి.. జూన్ వరకు పంటలకు నీళ్లివ్వాలి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి

116 టీఎంసీలు కావాలి.. జూన్ వరకు పంటలకు నీళ్లివ్వాలి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి
  • ఏపీ వాటా 66 శాతమే అయినా.. 75 శాతం తోడేసింది
  • ఇకపై శ్రీశైలం, సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్
  • కేఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ అధికారుల డుమ్మా.. 24కు వాయిదా

హైదరాబాద్, వెలుగు:కృష్ణా జలాల్లో కోటాకు మించి వాడుకుంటున్న ఏపీని కట్టడి చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌‌మెంట్ బోర్డు (కేఆర్‌‌ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు బోర్డు శుక్రవారం జలసౌధలో రెండు రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఈ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరఫున ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసం జూన్ వరకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ ఇండెంట్ పెట్టారు. 

కల్వకుర్తి లిఫ్ట్‌‌కు 24 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 58 టీఎంసీలు, ఏఎమ్మార్పీకి 34 టీఎంసీలు ఇవ్వాలని కోరారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా‌‌‌‌‌‌‌‌ తక్షణమే  ఉత్తర్వులు విడుదల చేయాలని  రాహుల్ బొజ్జా కోరారు. నీటిని విడుదల చేస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలోని 13 లక్షల ఎకరాల్లో వేసిన రబీ పంటలను కాపాడడంతోపాటు హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు తాగునీటిని ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పారు. 

ఏపీ ఒప్పందానికి మించి వాడుకుంది

ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతం , తెలంగాణ 34 శాతం నీళ్లను తీసుకెళ్లాల్సి ఉన్నా.. ఏపీ 75 శాతం నీటిని డ్రా చేసుకుందని బోర్డుకు రాహుల్ బొజ్జా ఫిర్యాదు చేశారు. ఏపీ ఇప్పటికే 650 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొన్నారు. తెలంగాణ వాడుకున్న నీళ్లు 225 టీఎంసీలేనని పేర్కొన్నారు. శ్రీశైలం,నాగార్జునసాగర్ నుంచి నిబంధనలను ఉల్లంఘించి నీటిని ఎత్తుకెళ్తున్న ఏపీని నియంత్రించాలని కోరారు. 

దీనిపై 2024 నవంబర్ నుంచి బోర్డుకు ఈఎన్సీ ఫిర్యాదు చేసినా.. బోర్డు పట్టించుకోలేదన్నారు. కాగా, ఏపీ సమావేశానికి రాకపోవడంతో ఈ వ్యవహారంపై సోమవారం (ఈ నెల 24న)  మీటింగ్ పెడతామని  కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. చైర్మన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన వారిలో ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, నల్గొండ సీఈ అజయ్ కుమార్ ఉన్నారు.