కృష్ణా ట్రిబ్యునల్​లో తెలంగాణ వాదనలు..బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది

కృష్ణా ట్రిబ్యునల్​లో తెలంగాణ వాదనలు..బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది
  • కావేరి అవార్డు ప్రకారం ఒక్క పంటకే నీళ్లు 
  • కర్నాటకకు అలాగే నీటి కేటాయింపులు
  • తెలంగాణ, ఏపీ జలవివాదం కూడా అలాంటిదే 
  • భౌగోళిక స్థితి కన్నా.. చారిత్రక కారణాలే చూడాలి 
     

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో నీటి పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయం వల్లే తాము లిఫ్టులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) కు తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ రాష్ట్రంలో గ్రావిటీతో కూడిన ప్రాజెక్టులను ప్రతిపాదించగా.. ఉమ్మడి ఏపీలో వాటిని పక్కనపెట్టారని చెప్పారు. అందుకే తెలంగాణలో లిఫ్టుల మీద ఆధారపడి పంటలకు నీళ్లివ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

గురువారం రెండో రోజు  ట్రిబ్యునల్​లో తెలంగాణ వాదనలను అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వినిపించారు. ప్రధానంగా తమిళ నాడు, కర్నాటక మధ్య కావేరి ట్రిబ్యునల్ కేటాయింపులపైనే వాదనలు జరిగాయి. 2018నాటి కావేరి ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా చేసుకుని తమిళనాడు, కర్నాటకకు నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్.. వ్యవసాయానికి నీటి వాడకాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించిందన్నారు. 

మల్టీ క్రాప్​కు బదులు సింగిల్ క్రాప్​కు నీళ్లు ఇవ్వాలని సూచించిందన్నారు. ఆ మేరకు కర్నాటకకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. ఔట్​బేసిన్​కు నీటిని తరలించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు.తెలంగాణ, ఏపీ ఇష్యూ కూడా అలాంటిదేనన్నారు.  

చారిత్రక కారణాలూ చూడాలి.. 

తెలంగాణ వాదనలు విన్న ట్రిబ్యునల్.. జియోగ్రాఫికల్ కండిషన్స్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందా? అని తెలంగాణ తరఫు అడ్వకేట్​ను ప్రశ్నించింది. అయితే, తెలంగాణకు చారిత్రకంగా ఎంతో అన్యాయం జరిగిందని ట్రిబ్యునల్​కు అడ్వకేట్ చెప్పారు. ఆ హిస్టారికల్ కారణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

తెలంగాణ ఒకప్పుడు పూర్తిగా వర్షపాతం మీద ఆధారపడిందన్నారు. కనీసం ఒక్క క్రాప్​కైనా నీటిని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకప్పుడు రైతులు బోర్​వెల్స్​పైనే ఎక్కువగా ఆధారపడేవారని గుర్తు చేశారు. బోర్​వెల్స్ లేకుంటే నీళ్లు లేవని చెప్పారు. లిఫ్టు ప్రాజెక్టుల ద్వారా కాల్వలకు నీళ్లి ఎత్తిపోసి పంట పొలాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. విద్యుత్​ అవైలబిలిటీ పెరగడంతో లిఫ్టుల అవసరం కూడా తప్పనిసరైందన్నారు. ఈ నేపథ్యంలోనే వాటికి కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

వాస్తవానికి ఇన్​సైడ్ బేసిన్​లో అవసరాలు తీరాకే ఔట్ సైడ్ బేసిన్​కు నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఔట్​సైడ్ బేసిన్​కు తరలించాల్సి వస్తే.. కేవలం తాగునీటికి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఇన్​సైడ్ బేసిన్ అవసరాలు తీరి.. సరిపోనూ జలాలుంటేనే ఔట్​సైడ్ బేసిన్​లో ఇరిగేషన్ అవసరాలకు నీళ్లివ్వడంపై ఆలోచించేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు.  వాస్తవానికి ఈ నీటిని ఎక్కడివక్కడే వాడుకోవాల్సి ఉంటుందని, ఈ సమస్యనూ పరిష్కరించాలని కోరారు.