జీబీ లింక్‌‌తో ఏపీ మరో జలదోపిడీ.. కృష్ణా నీళ్లతో పాటు గోదారి జలాలూ తోడేస్తున్నది: -కృష్ణా ట్రిబ్యునల్‌‌లో తెలంగాణ వాదనలు

జీబీ లింక్‌‌తో ఏపీ మరో జలదోపిడీ.. కృష్ణా నీళ్లతో పాటు గోదారి జలాలూ తోడేస్తున్నది: -కృష్ణా ట్రిబ్యునల్‌‌లో తెలంగాణ వాదనలు
  • సాగర్ కుడి కాల్వ ద్వారా బనకచర్లకు 200 టీఎంసీల ఎత్తిపోతలు
  • కృష్ణాలో 360, పెన్నాలో 228 టీఎంసీల స్టోరేజ్ సృష్టించుకున్నదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే కృష్ణా (శ్రీశైలం) జలాలను ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌లోని పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్న ఏపీ.. ఇప్పుడు గోదావరి జలాలనూ కృష్ణా ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్ బేసిన్ అయిన రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నదని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్– 2 (కేడబ్ల్యూడీటీ –2/ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ తెలిపింది. పోలవరం నుంచి సాగర్ కుడి కాల్వకు.. అక్కడి నుంచి బొల్లాపల్లి.. అటు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌కు 200 టీఎంసీలు తరలించేలా గోదావరి బనకచర్ల లింక్‌‌‌‌‌‌‌‌ను ఏపీ చేపడుతున్నదని తెలిపింది‌‌‌‌‌‌‌‌. 

అంటే ఒక్క శ్రీశైలమే కాకుండా ఏపీ ఇతర సోర్సుల ద్వారా కూడా నీటిని తరలించుకుపోతున్నదని అభ్యంతరం వ్యక్తంచేసింది.శుక్రవారం కృష్ణా ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌లో మూడోరోజు తెలంగాణ తన వాదనలు వినిపించింది. తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ఇప్పటికే ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ స్టోరేజీ కోసం కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో 360 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించుకున్నదని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు తెలిపారు. మరోవైపు పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌లోనూ 228 టీఎంసీల‌‌‌‌‌‌‌‌ నిల్వ సామర్థ్యాన్ని సృష్టించుకున్నదని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం తరలిస్తున్న ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌లోనూ పెన్నా బేసిన్, గుండ్ల కమ్మ వంటి సోర్సులున్నాయని తెలిపారు.

71 శాతం తెలంగాణకు ఇవ్వాల్సిందే

కృష్ణా నదీ జలాల్లో రెండు రాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీల్లో 71 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ అడ్వకేట్ కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలని అన్నారు. ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలించొద్దని కావేరీ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. 

ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. ఒకవేళ తరలించాల్సి వస్తే తాగునీటి కోసమే తరలించాల్సి ఉంటుందన్నారు. అయితే ఇప్పటికే ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 323 టీఎంసీలను ఆ రాష్ట్రం ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నదని గుర్తు చేశారు. అది చాలదన్నట్టు మరిన్ని నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు.