- పర్మిషన్లు ఇచ్చే ముందు ఎన్వోసీ తీసుకోవాలి
- యూజీసీకి విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం
- యూజీసీ తీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధమని వెల్లడి
- అవసరమైతే కేంద్ర మంత్రులను కలవాలని సీఎం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు అడ్డగోలుగా డీమ్డ్ యూనివర్సిటీలుగా అనుమతులు ఇవ్వొద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తమను సంప్రదించకుండా యూజీసీ ఇస్తున్న డీమ్డ్వర్సిటీ పర్మిషన్లతో స్థానికంగా ఉన్న మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, అది ప్రెసిడెన్షియల్ రూల్స్‌కు విరుద్ధమని తేల్చిచెప్పింది.
అవసరమైతే ఈ విషయంలో కేంద్ర మంత్రులను కూడా కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి స్పందన రాకుంటే.. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా అధికారులు అధ్యయనం చేయాలని రేవంత్ సూచించినట్టు తెలిసింది. ఇటీవల సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం ఇదే విషయమై ప్రత్యేకంగా సమావేశమై, చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున హయ్యర్‌ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్పర్సన్, ఇతర అధికారులు యూజీసీని కలిసి వచ్చారు.
వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీగా పర్మిషన్లు ఇచ్చేముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలని యూజీసీకి స్పష్టం చేయాలని, ఇందుకు ప్రభుత్వం తరపున లెటర్ రాయాలని సీఎం ఆదేశించారు. ప్రెసిడెన్షియల్ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలో విద్యా, ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశం ఇవ్వాలి.
కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇవ్వడంతో మొత్తం సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలోకే వెళ్లిపోనున్నాయి. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని రాష్ట్ర సర్కారు అంటున్నది. కన్వీనర్ కోటా అనేదే లేకుండా, మొత్తం సీట్లన్నీ మేనేజ్‌మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునేందుకు యూజీసీ నుంచి పర్మిషన్ ఇస్తున్నది.
యూజీసీకి క్యూ..
రాష్ట్రంలో ఇటీవల కొన్ని విద్యాసంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలుగా పర్మిషన్లు తీసుకున్నాయి. దీంతో రాష్ట్రంలోని మెరిట్విద్యార్థులకు కన్వీనర్ కోటా కింద దక్కాల్సిన సీట్లు.. కాలేజీ యాజమాన్యాలు అనుకున్నోళ్లకు, ఇష్టారీతిన ఇతర ప్రాంతాల్లోని వాళ్లకు ఇచ్చుకునే వెసులుబాటు దక్కుతున్నది. ఇంకోవైపు డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజు రెగ్యులేటరీ కమిటీతో సంబంధం లేకుండా సొంతంగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అరోరా, శ్రీచైత్యన్య డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నాయి.
మరో 10 కాలేజీలకుపైగా ఈ హోదా కోసం యూజీసీకి అప్లై చేసుకున్నాయి. 2 మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు డీమ్డ్వర్సిటీగా అప్రూవల్తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో అపోలో, సీఎంఆర్ లాంటి మెడికల్‌కాలేజీలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక కాలేజీ డీమ్డ్హోదా తెచ్చుకుంటే.. అసలు వాటి నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకుండా పోతుంది. అదొక సమస్య అయితే.. రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కాకుండా డబ్బులు ఉన్నోళ్లకే పెద్ద కాలేజీల్లో చదువుకునే అవకాశం దక్కుతుంది. ఇతర రాష్ట్రాలవారితో ఆ డీమ్డ్యూనివర్సిటీలు నిండిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనున్నది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డీమ్డ్ యూనివర్సిటీ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నది.
మెడికల్ కాలేజీలకు డీమ్ద్ వర్సిటీ హోదా రద్దు చేయాలి : టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్ గౌడ్
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ హోదాను రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి సమాఖ్య (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీతో పాటు పలు కాలేజీలకు సర్కారు అనుమతితో సంబంధం లేకుండానే యూజీసీ డీమ్డ్ హోదా ఇవ్వడం సరికాదని చెప్పారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ గా తీసుకోవాలని, డీమ్డ్ హోదాను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.