ప్రైవేట్​ దవాఖానాలపై పీఛేముడ్​

  • తనిఖీల పేరిట రెండు వారాలు హడావుడి

హైదరాబాద్/నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో దొంగ దవాఖాన్లు, నకిలీ డాక్టర్ల అంతుచూస్తామంటూ గప్పాలు కొట్టిన రాష్ట్ర సర్కారు నెలరోజుల్లోనే తోకముడిచింది. దసరా ముందు హెల్త్​ డైరెక్టర్​ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో డీఎంహెచ్​ఓలు ప్రైవేటు దవాఖానాలు, ల్యాబుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు వారాల పాటు జరిగిన ఈ తనిఖీల్లో పర్మిషన్​ లేని దవాఖానాలు, నకిలీ డాక్టర్లు, తప్పుడు సర్టిఫికేట్లతో నడుస్తున్న ల్యాబ్​లు, మల్టీ, సూపర్ స్పెషాలిటీల పేరిట జరుగుతున్న అనేక అక్రమాలు బట్టబయలయ్యాయి. చాలా చోట్ల హాస్పిటల్స్​, ల్యాబ్ లు సీజ్ చేశారు. సరైన వసతులు, క్వాలిఫైడ్ ​డాక్టర్లు లేని దవాఖానాలకు నోటీసులిచ్చారు. ఉలిక్కిపడ్డ హెల్త్  మాఫియా, పైస్థాయిలో పతారా చూపెట్టింది.  సర్కారు పెద్దల వద్ద బలమైన లాబీయింగ్​చేయడంతో సీన్​ రివర్సయ్యింది. కట్​చేస్తే తనిఖీలు అర్ధంతరంగా ఆగిపోయాయి. గత నెలలో సీజ్​చేసిన దవాఖానాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి.   

మధ్యలోనే ఆపేసిన్రు 

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దవాఖానాలు, ల్యాబులు, నకిలీ డాక్టర్లపై ప్రజల నుంచి కంప్లయింట్స్ ​ఎక్కువయ్యాయని చెప్పిన ప్రభుత్వం, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేయించింది. జిల్లాల్లో డీఎంహెచ్ఓల నేతృత్వంలో హెల్త్​టీమ్​లు రంగంలోకి దిగి, సుమారు 15 రోజుల పాటు హడావిడి చేశాయి. 3,810 హాస్పిటల్స్​లో తనిఖీలు నిర్వహించి, 1163 హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఏకంగా 165 దవాఖానాలను సీజ్​చేశారు. మరో106 హాస్పిటల్స్​కు భారీగా ఫైన్లు వేశారు. ప్రైవేటు దవాఖానాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని,  ఇంకా విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన అవసరముందని ఆఫీసర్లు ప్రకటిస్తూ వచ్చారు. కానీ, అంతలోనే తనిఖీలు ఆగిపోయాయి. నోటీసులు సర్వ్ చేసిన హాస్పిటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే యథావిధిగా నడుపుకునేందుకు ఓకే చెప్పారు. సీజ్ చేసిన హాస్పిటళ్లను తెరుచుకునేందుకు పర్మిషన్లు కూడా ఇచ్చేస్తున్నారు. 

లాబీయింగ్​కు తలొగ్గిన సర్కారు.. 

రెండు వారాల పాటు జరిగిన తనిఖీల్లో హాస్పిటళ్లలో జరుగుతున్న అనేక​ అక్రమాలను ఆఫీసర్లు గుర్తించారు.  పదో తరగతి చదివిన వ్యక్తులు కూడా ఎంబీబీఎస్‌, ఎండీ డాక్టర్లుగా చలామణి అవుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పంటి నొప్పి అని వస్తే గ్లూకోజ్ పెట్టడాన్ని చూసిన ఆఫీసర్లు నోరెళ్లబెట్టారు. అసలు రిజిస్ర్టేషనే లేకుండా 20 ఏండ్లుగా నడుస్తున్న దవాఖానాలను గుర్తించారు. డాక్టర్ అవతారమెత్తిన ఓ కంపౌండర్​, పెద్ద హాస్పిటల్ నడిపిస్తుండడాన్ని చూశారు. ప్రతి మూడింటిలో రెండు హాస్పిటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు తేల్చారు. ఇంకా తనిఖీ చేయాల్సిన హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు 6 వేల వరకూ ఉన్నాయి. వాటి జోలికి పోకముందే ప్రైవేటు హాస్పిటళ్లపై తనిఖీలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

క్వాలిఫైడ్ డాక్టర్లు నిర్వహించే హాస్పిటళ్లలో తనిఖీలు చేస్తూ, ఆర్‌‌ఎంపీలను టచ్ చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. దీంతో హెల్త్ ఆఫీసర్లు కొన్ని ఆర్‌‌ఎంపీల క్లినిక్‌లను మూసి వేయించారు. ఇంకేం.. ఆర్‌‌ఎంపీ సంఘాలు రంగంలోకి దిగి తమను టచ్ చేస్తే ఇబ్బందులు తప్పవని పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఆర్‌‌ఎంపీలను ముట్టుకోవడం లేదని, సర్జరీలు, అబార్షన్లు చేసే ఆర్‌‌ఎంపీల క్లినిక్‌లనే తనిఖీ చేస్తున్నామని ఒక దశలో మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఓ వైపు ప్రైవేట్​హాస్పిటల్స్​, డాక్టర్లు, ఆర్​ఎంపీల అసోసియేషన్లు, మరోవైపు మెడికల్​మాఫియా తీవ్ర ఒత్తిడి చేయడం వల్లే సర్కారు తలొగ్గినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక రావడంతో తనిఖీలను ఆపేయాలని హెల్త్ ఆఫీసర్లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో కథ కంచికి చేరింది. 

సీజ్​ చేశారు.. ఓపెన్​ చేశారు.. 

ఖమ్మం జిల్లాలో రెండు దవాఖానాలు, ఒక డయాగ్నస్టిక్​ సెంటర్​ సీజ్​ చేయగా, ఒక హాస్పిటల్​, డయాగ్నస్టిక్​ సెంటర్​తెరుచుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 హాస్పిటల్స్​ సీజ్ చేయగా, 18 హాస్పిటల్స్ రీ ఓపెన్​చేసుకోవడానికి పర్మిషన్​ ఇచ్చారు. యాదాద్రి జిల్లాలో12 హాస్పిటల్స్​, ల్యాబ్​లను సీజ్​ చేయగా, అన్నీ తెరుచుకోవచ్చని గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో 9 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్ చేయగా, 3 హాస్పిటల్స్​ ఓపెన్ చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో 46 హాస్పిటల్స్, ల్యాబ్స్​,ఆర్​ఎంపీ క్లినిక్​లను సీజ్ చేశారు. మళ్లీ అన్నింటినీ నడిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో రెండు సీజ్​ చేయగా రెండు, సంగారెడ్డి జిల్లాలో  7 ప్రైవేట్​ హాస్పిటల్స్​ సీజ్​ చేయగా 6 తెరుచుకున్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో మూడు హాస్పిట్స్​ సీజ్ ​చేసి, మూడింటిని ఓపెన్​ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు దవాఖానాలు సీజ్​ చేయగా, రెండూ ఓపెన్​ అయ్యాయి.  ములుగు జిల్లాలో 3 హాస్పిటల్స్ సీజ్ చేయగా మూడింటినీ తెరిచారు.