
- ఈ నెలాఖరుతో ముగియనున్న పదవీ కాలం
- కొత్త సీఎస్ గా రామకృష్ణారావుకు చాన్స్?
- సీఎం అధ్యక్షతన ఆర్టీఐ సెలక్షన్ కమిటీ మీటింగ్
- కీలక నిర్ణయం జరిగినట్టు ఊహాగానాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాజీనామా యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఆమె పదవీ కాలం ముగియనుంది. ఈ తరుణంలో ఆమెకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవిని కట్టబెడతారని తెలుస్తోంది. శాంతి కుమారి స్థానంలో రామకృష్ణారావును కొత్తగా సీఎస్ గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఏపీకి అలాట్ కావడంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ప్రధాన సమాచార కమిషనర్ 2020 ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023 ఫిబ్రవరి 24న తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. ఢిల్లీలోని కేంద్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ తో పాటు రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల పోస్టులను 8 వారాల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 7న కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లు, ప్రధాన కమిషనర్ లేక పోవడం వల్ల ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ పొందం కొంత కష్టతరంగా మారిందనే ఆరోపణలున్నాయి. గతంలో ప్రధాన కమిషనర్లుగా రాజా సదారాం, బుద్ధామురళి పనిచేశారు. తర్వాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు.
గతేడాది జూన్ నెలలో ఈ పదవుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన అధికారులు ఈ పదవుల కోసం దరఖాస్తు సమర్పించగా వాటిని వడపోసి, అర్హులైన వారితో జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఈ పదవి కోసం తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వార్త సచివాలయ వర్గాల్లో గత నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ జరిగిన సమావేశంలో ఆమె పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం తన పేరు ఖరారు చేయగానే ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటారని సమాచారం.