టీఆర్ఎస్ పార్టీ గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ ను కోరామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. గతంలో కారును పోలిన గుర్తుల వల్ల స్వల్ప మెజార్టీతో పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. అందుకే కారును పోలిన విధంగా ఉన్న 8 గుర్తులను తొలగించాలని కోరినట్లు వెల్లడించారు. ‘‘ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పిచ్చి లేసింది. అందుకే దేవుడి తో సమానమైన సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నరు. ఆయన పద్ధతి మార్చుకునేలా లేడు. అందుకే సీఈఓను కలిసి ఫిర్యాదు చేసినం. వాళ్ల పార్టీకి తెలంగాణలో రోజురోజుకు ఆదరణ తగ్గుతుండటంతో ఇలా వ్యవహరిస్తున్నడు’’ అని తెలిపారు.
బుద్ధ భవన్ లో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ ను కలిసిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఉన్నారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ ను కోరామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ తెలిపారు. ‘‘బీజేపీ అధ్యక్షుడు రాసిచ్చిన స్క్రిప్ట్ నే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదవడం మూర్ఖత్వమే’’ అని వ్యాఖ్యానించారు.