
ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం అమలు చేస్తున్న విధానంలో చెరువులు, బఫర్ జోన్, ప్రభుత్వ, శిఖం, సీలింగ్ ల్యాండ్స్ పరిధిలో ఉన్న లే అవుట్లు, ప్లాట్ల నుంచి రెగ్యులరైజేషన్‌కు ఫీజు వసూలు చేస్తున్నారు. తర్వాత వాటిని ఫీల్డ్లో ఎంక్వైరీ చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్టు ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి అనుగుణంగా అధికారులు నిషేధిత భూముల జాబితాను కూడా రెడీ చేశారు. సర్వే నెంబర్ల వారీగా ఎక్కడెక్కడ ప్రభుత్వానికి భూములు ఉన్నాయి? ఏ సర్వే నంబర్లలో చెరువులు, వాటి శిఖం భూములున్నాయి? అనే వివరాలతో సన్నద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు.
కానీ.. ఈ సర్వే నెంబర్లు ఆటోమేటిక్గా బ్లాక్ చేయడం లేదు. నిషేధిత లే అవుట్స్‌లోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే టైంలో రెడ్ సింబల్ చూపిస్తుందని చెప్తున్నారు. కానీ సర్వే నెంబర్ మార్చి చేస్తే ఎలాంటి అభ్యంతరం రాదని, దీంతో అలా కూడా రెగ్యులైజేషన్, తద్వారా అక్రమాలకు అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కేవలం నిషేధిత జాబితాలో చూపించిన మాత్రాన ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆగిపోకుండా ఉండదని, పైగా ఒక్కసారి ప్రభుత్వానికి ఫీజు చెల్లించి, నిర్మాణాలు పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ఆధారాలతో కోర్టులకు వెళ్తే అక్రమార్కులకు ఇదో వరంలా మారుతుందనే చర్చ నడుస్తున్నది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్లికేషన్లు పరిశీలించి.. అన్నీ సక్రమంగా ఉంటేనే ఎల్‌ఆర్‌ఎస్ కింద 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కట్టాలని నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడు నిర్ణీత మొత్తం చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు ఈ కండీషన్లు ఎత్తేయడంతో అవినీతి అధికారులకు ఊతమిచ్చినట్టయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.