ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం :  ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ కల్పిస్తాం
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం 
  • మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్​ అధ్యక్షతన కృతజ్ఞతగా బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్, రెండో బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం, మూడో బిల్లు ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిందని వివరించారు. ప్రస్తుతం 15 శాతం ఉన్న ఎస్సీలో 59 ఉపకులాలకు కోటాలను కేటాయించేలా ఈ బిల్లు రూపొందించినట్లు తెలిపారు. ఈనెల 17న ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లుపై, 18న బీసీ రిజర్వేషన్లు, కుల సర్వే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు.

 కాంగ్రెస్ మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తోందని, విభజనకు ముందే ఈ ప్రతిపాదనను పార్టీ చేపట్టిందని గుర్తుచేశారు. తన నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి న్యాయమూర్తి షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్‌‌‌‌ను నియమించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పాస్​ చేయడానికి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఎస్సీలకు రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ డిమాండ్ 2026 జనగణన ఆధారంగా పరిష్కరించబడుతుందని తెలిపారు. 

సంక్షేమ పథకాలను కొసాగిస్తాం..

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇన్​చార్జి మంత్రిగా సూర్యాపేట జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

త్వరలోనే మూసీని గోదావరి జలాలతో ప్రక్షాళన చేసి మూసీపై రాజకీయం చేస్తున్న వారి నోళ్లు మూయిస్తామన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం 

కోదాడ, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోదాడ పట్టణంలో మూడు రోజులపాటు జరిగే విశ్రాంత ఉద్యోగుల క్రీడాపోటీలను ఆదివారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను విశ్రాంత ఉద్యోగినేనని, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉందని, ప్రతినెలా ఒకటో తారీఖున వేతనాలు చెల్లిస్తోందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖున పెన్షన్లు చెల్లిస్తున్నామని, హెల్త్ కార్డుల మంజూరు వంటి సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.