మూసీనదికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. లండన్ నగరంలోని థేమ్స్‌నది తరహాలో మూసీని తీర్చిదిద్దే లక్ష్యంతో.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మూసీని సుందరీకరించి, నది పొడవునా వాణిజ్య, వినోద కారిడార్లను ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
కృష్ణానదికి ఉప నదులు మూసీ, ఈసాలు.
మూసీ, ఈసాలు కృష్ణానదికి ఉప నదులు. 1908 సెప్టెంబర్ 28న 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ సంవత్సరంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని అప్పటి నిజాం నవాబు మూసీ, ఈసీల వరద ఉధృతిని ఆపడానికి గండిపేట వద్ద మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్, ఈసా నదిపై హిమాయత్‌సాగర్ వద్ద రిజర్వాయర్లను నిర్మించారు. అవి నిండిన తరువాత ఆ రెండు నదులు లంగర్‌హౌస్ వద్ద ఒకటిగా కలుస్తాయి. మూసీ నదిపై హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి.
వీటిలో పురానాపూల్ అత్యంత పాత వంతెన. మూసీ 2,168 అడుగుల ఎత్తులో పుట్టి.. తూర్పు దిశగా ప్రవహిస్తూ హైదరాబాద్ నగరాన్ని దాటి ఆలేరు నదులు కలుపుకుని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతోంది. మొత్తంగా మూసీ నది బేసిన్ వైశాల్యం 4,329 చదరపు మైళ్లు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చటానికి.. మూసీ ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించారు.
కాలుష్యం కోరల్లో మూసీ
ఘన చరిత్ర ఉన్న మూసీనదిలో కాలుష్యం ముదిరిపోయి కాలకూటంగా తయారైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై చేసిన అధ్యయనం మూసీపై ఇదే తేల్చింది. ‘ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’(పీఎన్ఏఎస్) అనే జర్నల్ లో ‘ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ ఇన్ ది వరల్డ్ రివర్స్’ పేరుతో ఈ అధ్యయనం చేసింది. దేశవిదేశాల నిపుణులతో కూడిన ఈ బృందం 140 దేశాల్లోని 258 నదుల నుంచి శాంపిళ్లను సేకరించింది.
ఈ అధ్యయనంలో ప్రపంచంలోని కాలుష్యంపై 140 దేశాల్లోని 258 నదులపై సైంటిస్టులు చేసిన పరిశోధనలో ప్రమాదకర నదుల్లో మూసీ 22వ స్థానంలో నిలవడం ఆందోళనకరం. మూసీ నీళ్లలో కెమికల్స్ విపరీతంగా పెరిగిపోయాయని సైంటిస్టులు తేల్చారు. ఆ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాల(ఏపీఐ) ఆనవాళ్లను గుర్తించారు. అందుకే సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలినాళ్లలోనే మూసీ అభివృద్ధి, సుందరీకరణపై దృష్టి సారించారు. రాష్ట్రంలో సరికొత్త విధానంతో సీఎం రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’ తీసుకొచ్చారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక. హైడ్రా రాకతో మూసీనదికి ఇరువైపులా ఉన్న కబ్జాలకు చెక్ పడనుంది. మూసీ అభివృద్ధితో పాటు పరిరక్షణకు కూడా అడుగులు పడనున్నాయి.
మూసీనది పునరుజ్జీవంతో.. పర్యాటక, వాణిజ్య శోభ
విశ్వనగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన హైదరాబాద్ నడిబొడ్డున మూసీ ప్రవహించడం వలన పర్యాటకం, వాణిజ్యపరంగా అద్భుత శోభ రానుంది. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఉన్నతాధికారులతో కలిసి లండన్‌లో పర్యటించారు.
మూసీ నది పునరుజ్జీవానికి తీసుకోవాల్సిన చర్యలపై లండన్‌లోని థేమ్స్ నది పాలక మండలి అధికారులు, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో చర్చలు జరిపారు. థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తిమంతంగా తయారవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. తన విజన్ 2050 కు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ సుందరీకరణ
అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టింది. నగరానికి పడమర దిక్కున ఉన్న జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసీ తీర ప్రాంతాన్ని గ్రామ నక్ష ఆధారంగా డిజిటల్ సర్వేను ఎంఆర్‌డీసీఎల్ అధికారులు నిర్వహిస్తున్నారు. మూసీ నది సరిహద్దు, దాని పరిసర ప్రాంతాలపై సమగ్రమైన సర్వేను నిర్వహిస్తూ గరిష్ట వరద స్థాయిని ఖరారు చేస్తున్నారు. మూసీ తీరం వెంబడి 50 మీటర్ల కారిడార్‌ను బఫర్‌జోన్‌గా గుర్తించి, ఆ ప్రాంతంలో భవిష్యత్తులో దాన్ని యుటిలిటీ కారిడార్‌గా మార్చనున్నారు.
ఇందుకోసం మూసీ తీరం వెంబడి అవసరమైన చోట భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ఒకేసారి మూసీ నది తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి రకరకాల ప్రణాళికలను రూపొందిస్తూ.. క్షేత్ర స్థాయిలో మూసీ సరిహద్దులను నిర్ణయించేందుకు అధికారులు జియోగ్రాఫికల్ సర్వేను నిర్వహిస్తున్నారు. మూసీ సరిహద్దు నిర్ధారణకు డిజిటల్ సర్వే మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో కాలుష్య జలాల పీడ వదలనుంది. మూసీతో హైదరాబాద్ మహానగరం సకల అభివృద్ధితో పాటు పర్యాటకంగాను రాణించనుంది.
మాస్టర్ ప్లాన్‌లో 5 అంశాలకు ప్రాధాన్యం
మూసీ పరిరక్షణ కోసం రూపొందించే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్‌లో 5 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో 1. బ్లూ మాస్టర్ ప్లాన్, 2. మార్కెట్ ఫెసిబిలిటీ స్టడీ, 3. ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, 4. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 5. ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్లు ఉంటాయి. వీటిలో అధిక ప్రాధాన్యతనిస్తున్న బ్లూ మాస్టర్‌ప్లాన్‌లో స్థిరమైన నీటి వనరుల వినియోగానికి సమగ్ర నిర్వహణ వ్యూహాలు, నీటి నాణ్యత నిర్వహణ, పర్యావరణ వ్యవస్థ సంరక్షణ, వరద నియంత్రణ, ఉపశమనం, దీర్ఘకాలిక పర్యవేక్షణ వంటివి ఉంటాయి.
అదేవిధంగా రవాణా ఆధారిత అభివృద్ధి అంశం (టీవోడీ)పైనా ప్రత్యేకంగా డిజైన్‌లను కన్సల్టెన్సీలు రూపొందించాల్సి ఉంటుంది. మూసీలోకి రోజుకు సుమారు 1800 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. రోజుకు 700 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు గతంలో ఉన్నాయి. సుమారు రూ.3,820 కోట్లతో మరో 38 ఎస్టీపీలను నిర్మించి మిగిలిన 1100 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు. ఇటీవలనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎస్టీపీలను ప్రారంభించి అందుబాటులోకి తేవడం జరిగింది.
మూసీ ప్రక్షాళనకు మాస్టర్‌ప్లాన్
మూసీ నది ప్రక్షాళన, సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్ ప్లాన్‌లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కున ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు సరిహద్దు వరకు, అదేవిధంగా మరో జలాశయమైన హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు.
మూసీ, ఈసీ నదుల సంగమం వరకు కలిపి మొత్తం 55 కి.మీ మేర ఉన్న నదీ పరీవాహక ప్రాంతానికి సంబంధించి అగ్రిగేట్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.1.50 లక్షల కోట్ల వరకు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసుకుంది. పీపుల్స్ ప్లాజా, చిల్ట్రన్స్ పార్కులు, పాదచారుల జోన్లు ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్, ట్యాంక్ బండ్ తరహాలో మూసీ ప్రాజెక్ట్‌ను నగరానికి ఓ మణిహారంగా తీర్చిదిద్దనున్నారు.
డా.ఎన్. యాదగిరిరావు
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ