ఐటీ ఇన్​ఫ్రాపై సర్కార్​ ఫోకస్​!

ఐటీ ఇన్​ఫ్రాపై సర్కార్​ ఫోకస్​!
  • మౌలిక వసతులకే బడ్జెట్​లో రూ.250 కోట్లు..  ప్రమోషన్లకు రూ.156 కోట్ల నిధులు
  • టైర్ 2, 3 సిటీల్లో మెరుగైన వసతుల కోసం చర్యలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిపై సర్కార్​ ఫోకస్​ పెట్టింది. ఐటీ మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నది. దీంతోపాటు ఐటీ ప్రమోషన్స్​నూ పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఐటీ ప్రమోషన్స్​ కార్యక్రమాలకు భారీగా నిధులను కేటాయించింది. శాఖకు ఇటీవలి బడ్జెట్​లో రూ.774 కోట్లు కేటాయించిన సర్కారు.. అందులో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ రూ.250 కోట్లకుపైగా నిధులు ఇచ్చింది.

ఇటు ఐటీ ప్రమోషన్ల కోసం రూ.156 కోట్లు కేటాయించడం విశేషం. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సెక్రటేరియెట్​క్యాంపస్​ ఏరియా నెట్​వర్క్​ (స్కాన్​)కు హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ల అప్​గ్రేడేషన్​, మణికొండలోని స్టేట్​ డేటా సెంటర్​తోపాటు సెక్యూరిటీ ఆపరేషన్స్​సెంటర్​ మెయింటెనెన్స్​కు ప్రాధాన్యం ఇవ్వనున్నది. టైర్​–​ 2, టైర్​– 3 సిటీస్​లోని ఐటీ పార్క్స్​కు మెరుగైన రోడ్లు, నీరు, విద్యుత్​ సౌకర్యాలు అందించేందుకు రూ.100 కోట్ల దాకా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది.

తెలంగాణ ఇండస్ట్రియల్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కార్పొరేషన్​(టీజీఐఐసీ) మౌలిక వసతుల కల్పన బాధ్యతను చేపట్టనున్నట్టు తెలిసింది. అందులో భాగంగా వరంగల్​ ఐటీ టవర్​ ఫేజ్​–2ను చేపట్టడంతోపాటు అసంపూర్తిగా మిగిలిన కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండల్లోని ఐటీ పార్క్​లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు.  

మరింత మెరుగ్గా నెట్​ సేవలు

రాష్ట్రంలో ఇంటర్నెట్​ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు సర్కారు కసరత్తు  చేస్తున్నది. మారుమూల ప్రాంతాలకూ నెట్​సేవలు అందేలా ఫైబర్​ గ్రిడ్​ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు తెలి సింది. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని జనాలకు నెట్​, కేబుల్​ సేవలు అందడమేగాకుండా నెట్​సేవలు అందుబాటులో లేని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులకూ ఉపయోగకరంగా ఉంటుందని సర్కారు భావిస్తున్నది.

స్టేట్​ డేటా సెంటర్​పై ప్రత్యేక దృష్టి పెట్టి కమ్యూనికేషన్స్​ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్న రాష్ట్ర సర్కార్​.. అందుకు తగ్గట్టుగా అత్యాధునిక సర్వర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అన్ని డిపార్ట్​మెంట్లలోనూ సర్వర్లను అప్​గ్రేడ్​ చేసేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది.