సర్కారు అప్పులు.. పన్నులై కూసుంటయి

తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.4 లక్షల కోట్లు దాటాయి. అధికారం నిలుపుకోవడానికి అధికార పార్టీ చేస్తున్న అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారమవుతున్నాయి. ఈ అప్పులు కూడా ఆదాయం కోసం పెడ్తున్న పెట్టుబడులు కావు. కొందరికి దోచి పెడుతున్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి బలమున్న వర్గాలకు తాయీలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ అప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వీటిని అభివృద్ధి పథకాలుగా, పేదరిక నిర్మూలన ప్రాజెక్టుల మాదిరిగా చూపిస్తూ.. ప్రజలను మభ్యపెడుతోంది. సర్కారు చేస్తున్న ఈ అప్పులు మున్ముందు ప్రజల నెత్తిమీద పన్నులై కూసంటయి. 

రాష్ట్రానికి కేంద్ర నిధులు మొత్తం రాష్ట్ర ఆదాయంలో 2014-–15లో దాదాపు 30 శాతం ఉండగా, 2020-– 21 నాటికి అవి 27 శాతానికి పడిపోయాయి. కేంద్ర నిధులు పెరిగాయి, దానికి తోడు రాష్ట్ర ఆదాయం కూడా పెరగడంతో ఈ శాతం తగ్గింది. 2014-–15లో ఈ నిధులు రూ.15,307 కోట్లు కాగా, 2020–-21 నాటికి అవి రూ.28,162.75 కోట్లకు చేరాయి. 2018–-19 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సాపేక్షంగా అధిక సొంత వనరుల -స్థూల రాష్ట్ర ఆదాయం నిష్పత్తి 7.5 శాతం సాధించింది. ఇతర రాష్ట్రాల కంటే సొంత వనరులపై తెలంగాణ ఎక్కువ ఆధారపడటాన్ని సూచిస్తోందని స్వయంగా15వ ఆర్థిక సంఘం కితాబిచ్చింది. అయితే, రాష్ట్ర వనరులు ఎక్కువగా పన్నుల నుంచి వచ్చినవే. 2014-–15 లో రాష్ట్ర పన్నులు రూ.29,288 కోట్లు కాగా, 2020–-21 నాటికి అవి రూ.66,650.37 కోట్లకు చేరాయి. ఏడేండ్ల కాలంలో పన్నుల నుంచి ఆదాయం రెండింతలయ్యింది. 2020–-21లో పన్నుల ఆదాయం క్రితం సంవత్సరం కంటే తగ్గడానికి కరోనా ప్రభావం కారణమైంది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న రూ.76,196 కోట్ల అంచనాకు దగ్గరగానే పన్నులు వసూలు అయ్యాయి. పన్నుల రాబడి పెరుగుతున్న దరిమిలా ప్రభుత్వం 2021–-22లో రూ.92,910 కోట్లు, 2022–-23లో రూ.1,08,212 కోట్లు వస్తాయని ఆశ పెట్టుకుంది. ప్రజల మీద భారం గురించి అస్సలు ఆలోచించలేదు.
 

అప్పులతో ప్రజాప్రయోజనాలు..
అప్పుల పరిమాణం తెలంగాణాలో భారీగా పెరుగుతున్నది. అటు కేంద్ర ప్రభుత్వానిదీ అదే తీరు. అప్పులకు సంబంధించిన సమాచారం రెండు ప్రభుత్వాలు సరైనా పద్ధతిలో ప్రజల ముందు పెట్టడంలేదు. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్​లో అప్పులు తీసుకుంటున్నది. నిబంధనల ప్రకారం వీటికి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలి. స్వయంగా ఆర్బీఐ మాత్రం అప్పులు తీసుకోవడం తప్పు కాదు? తీసుకున్న అప్పులను సెకండరీ మార్కెట్​లో బహిరంగంగా పోటీ పెట్టి ఇంకా అప్పులు సృష్టించడానికి వ్యవస్థ ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంటే, ప్రభుత్వ అప్పులను ఇంకెవరైనా కొనుక్కోవచ్చు. ప్రభుత్వ నిధులు ఇట్లా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, పెట్టుబడిదారుల నుంచి సేకరిస్తే మున్ముందు ప్రజా ఆస్తులు, ప్రకృతి వనరులు, ప్రజా పాలన మీద పగ్గాలు వారికి అప్పగించే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది విఘాతం కలిగిస్తుంది. కోట్లాది పేద ప్రజల ప్రయోజనాలు మట్టి కొట్టుకుపోతాయి. ఇప్పటికే, లక్షల ఎకరాల భూమి, ఖనిజ వనరులు, ఇంకా ఇతర అనేక ప్రజావసరాలు తీర్చే వనరులు ప్రైవేటు పరం అయ్యాయి. 
 

మోయలేని భారం 
తెలంగాణ ప్రభుత్వం మోయలేని భారం నెత్తికెత్తుకున్నది. స్వయంగా ముఖ్యమంత్రి  కనీస పాలన సూత్రాలకు విరుద్ధంగా హామీలు ఇస్తూ, ఆ హామీలు నెరవేర్చే క్రమంలో సొంత నిధులు సరిపోక, అప్పులు చేసినా సరిపోక, కేంద్ర నిధుల కోసం అగచాట్లు పడుతున్న వైనం చూస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు బంధు, దళిత బంధు మనకు కనపడుతున్న కొన్ని పథకాలు. వీటి లక్ష్యాలు ఎవరు కాదనలేనివి. కానీ ఆ పథకాలకు ఖర్చుల భారం ఆలోచించకుండా ప్రకటించడం, వనరుల పరిమితిని గుర్తించకపోవడం వంటి లోపల వల్ల అమలులో గందరగోళం ఏర్పడుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తీసుకుంటే కేంద్రం ఆవాస్ యోజన కింద ప్రతి లబ్ధిదారుడికి నిధులు ఇస్తుంది. కానీ ముఖ్యమంత్రి ప్రతి లబ్ధిదారునికి రూ.7 లక్షలతో 100 శాతం ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని వాగ్దానం చేయడంతో, ఇంటికి అయ్యే ఖర్చులో  కేంద్రం ఇచ్చే రూ.72 వేలు దేనికి సరిపోని పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనాలు భారీగా పెంచటం, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోవటం వల్ల దాన్ని కేంద్ర విధి విధానాల నేపథ్యంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం తగ్గిపోయింది. మొదట్లో ఎక్కడ మోకాలు అడ్డుతుందో అని కేంద్ర అనుమతులు రాకుండానే ప్రాజెక్ట్ మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ నీటి ప్రాజెక్ట్ ది కూడా ఇదే పరిస్థితి. భారీ అంచనాలతో భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టి, ఉన్న నిధులన్నీ వాటికే ఊడ్చిపెట్టి, ఇతర అవసరాల గురించి గుర్తించకుండా, ఆయా పెట్టుబడులకు వచ్చే ఆదాయంచ, సత్ఫలితాల గురించి అంచనాలు వేయకుండా, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ నిర్వహణలో అనేక తప్పటడుగులు వేసింది. కాగ్ కూడా బడ్జెట్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నివేదిక ఇచ్చింది. అంచనాలు, వాస్తవ పరిస్థితి మధ్య ఉన్న భారీ తేడాను వేలెత్తి చూపింది. రాష్ట్రంలో రాబడి 2014-–15లో రూ.80 వేల కోట్లు ఉండగా, 2022–-23 నాటికి అది రూ.193 వేల కోట్లకు పెరిగినా, నిధులు సరిపోవడం లేదు. అధికార పార్టీ పాలన సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అంకెల ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, వర్తమానంలో, భవిష్యత్తులో ప్రజల మీద భారం పడే విధంగా ఉంది.

6 లక్షల కోట్లకు దగ్గరగా?
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రుణాలు తీసుకునేందుకు పరిమితి ఉండటంతో సర్కారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి కౌంటర్ గ్యారెంటీగా ఉంటూ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే నాటికి ప్రభుత్వ అప్పులు రూ.69,479.49 కోట్లు ఉండగా, అవి ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు రాష్ట్ర అప్పులు రూ.6 లక్షల కోట్లకు దగ్గరగా వచ్చినట్లు 
ఓ అంచనా. మిషన్ భగీరథ, కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. తుపాకులగూడెం బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల కోసం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ లైన్ల విస్తరణ, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు బ్యాంకర్ల నుంచి అప్పులు తీసుకుంది. కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. అప్పులు తీసుకోవచ్చు. శాసనసభ ఆమోదం అవసరం లేదు. ఖర్చు ఆడిట్ ఎప్పుడైనా చేయవచ్చు. తాము అనుకున్న వ్యక్తుల లేదా సంస్థలకు పనుల కాంట్రాక్టు ఇవ్వొచ్చు. సాధారణ రాజ్యాంగ సంస్థల నిఘా నుంచి తప్పించుకోవచ్చు. ప్రజల ముందు సమాచారం కూడా పెట్టాల్సిన బాధ్యత కూడా తప్పుతుంది.


పెరుగుతున్న వడ్డీ భారం
సర్కారు తీసుకుంటున్న అప్పులకు వడ్డీ శాతం7.39 నుంచి 12.10 శాతం వరకు ఉంది. రుణాల చెల్లింపు కాల పరిమితి కనీసం 7 నుంచి గరిష్టంగా 38 సంవత్సరాల మధ్య ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం పెరగడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇటీవల తీసుకున్న కొన్ని అప్పుల కాల పరిమితి 38 ఏండ్లకు పెరిగింది.కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా ఉండటంతో బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్నాయి. మిషన్ భగీరథ పథకం కోసం బ్యాంకులు పోటీపడి రుణాలు ఇచ్చాయి. 2014 నుంచి మార్చి, 2018 వరకు సర్కారు అప్పులకు వడ్డీ కింద రూ.31,719.8 కోట్లు చెల్లించింది. 2014 సంవత్సరంలో రూ.5,226.85 కోట్లు, 2015 లో రూ.7,557.53 కోట్లు, 2016లో  రూ.8,609.22 కోట్లు, 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.10,326.20 కోట్లు వడ్డీ చెల్లింపులు జరిగాయి. రుణంతో పాటు, వడ్డీ భారం కూడా పెరుగుతున్నది.                                     - దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్