- ప్రధాన ప్రాజెక్టులకు ఈఎన్సీ, సీఈలే బాధ్యులు
- మీడియం ప్రాజెక్టులన్నీ ఎస్ఈలకు ..మైనర్ ప్రాజెక్టులు ఈఈలకు
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21.. భారీ శబ్దంతో భూమిలోకి కుంగింది. నిరుడు వచ్చిన భారీ వరదలకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు కట్ట కొట్టుకుపోయింది. నిరుడు వానాకాలంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్‌హౌస్ నీట మునిగింది. మరి, వాటన్నింటికి బాధ్యులెవరు? నిర్మాణ సంస్థలా? అక్కడ ఉన్న అధికారులా? ఎవరు.. అంటే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని తప్పించుకున్నారే తప్ప ఏమీ తేలలేదు. అందుకే ఇరిగేషన్ శాఖ.. డ్యాముల సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించింది.
డ్యామ్ సేఫ్టీకి చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశమై గైడ్‌లైన్స్ తయారు చేయగా.. తాజాగా డ్యాములకు ‘ఓనర్లనూ’ నిర్దేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోని స్పెసిఫైడ్ డ్యాములన్నింటికీ బాధ్యులను నిర్వచించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 174.. మేజర్, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల బాధ్యతలు ఎవరెవరివో నిర్దేశించింది. దానికి సంబంధించి స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉత్తర్వులనూ జారీ చేసింది. మేడిగడ్డ, సింగూరు, ఎస్సారెస్పీ సహా ప్రధాన ప్రాజెక్టులకు ఎవరు డ్యామ్ ఓనర్లన్నది స్పష్టం చేసింది.
డ్యామేజ్ జరిగితే వారిదే బాధ్యత
ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ చీఫ్ ఇంజనీర్లే ఓనర్లు అని ఉత్తర్వుల్లో స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ చైర్మన్ ఈఎన్సీ జనరల్ స్పష్టం చేశారు. 58 మేజర్ డ్యాముల్లో నాలుగు ఈఎన్సీ, 20 ప్రాజెక్టులు సీఈలు, 13 ప్రాజెక్టులు ఎస్ఈ, 21 ప్రాజెక్టులకు ఈఈలు ఓనర్లుగా ఉంటారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్ కు ఈఎన్సీ/సీఈ ఓనర్‌గా నిర్దేశించింది. నాగార్జునసాగర్, జూరాల, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, సమ్మక్కసాగర్, నిజాంసాగర్, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు, చనాక కొరాట, సదర్మట్, గౌరవెల్లి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం, ముచ్చోనిపల్లి రిజర్వాయర్, రేలంపాడు వంటి ప్రాజెక్టులకు సీఈలే ఓనర్లని స్పష్టం చేశారు.
వాటితో పాటు స్పెసిఫైడ్ డ్యామ్స్ లిస్ట్‌లో పేర్కొన్న 41 మీడియం ప్రాజెక్టులకు ఎస్ఈలు, 75 మైనర్ ప్రాజెక్టులకు ఈఈలకు అప్పగించారు. భవిష్యత్‌లో ఆయా ప్రాజెక్టులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా.. డ్యామేజ్లు అయినా దానికి పూర్తి బాధ్యత ఆయా అధికారులదేనని తేల్చి చెప్పారు. కాగా, డ్యామ్ సేఫ్టీపై నిర్వహించిన మీటింగ్ తర్వాత ఇప్పటిదాకా డ్యాముల రక్షణకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలంటూ ఈఎన్సీలు, సీఈలు, ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.