ఏఐ సర్కార్​ దిశగా తెలంగాణ... అన్ని డిపార్ట్​మెంట్లలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​

  • ఏఐ రోడ్​ మ్యాప్​లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • కోటి మంది లబ్ధిదారులకు ఏఐ ద్వారా స్కీములు అందజేత
  • సీఎం ఆఫీసుకు గైడెన్స్​ ఇచ్చేలా ఏఐ అడ్వైజరీ కౌన్సిల్​ 
  • కౌన్సిల్​ కింద కొలాబరేషన్​ నెట్​వర్క్​, ఎమర్జింగ్​ టెక్నాలజీస్​ విభాగాలు
  • 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్​ ప్రోగ్రామ్స్​
  • రాష్ట్రంలో 50 యానోటేషన్​ సెంటర్లు.. పది వేల మందికి ఉపాధి
  • విద్యార్థులూ నెలకు రూ.5 వేలు సంపాదించుకునేలా ప్రోత్సాహం
  • ‘తెలంగాణ వైభవం – ఏఐ ప్రోగ్రామ్’ నిర్వహణ.. దీనిపై సీఎం నేతృత్వంలో భారీ ప్రచారం
  • వచ్చే ఏడాది నుంచే స్కూళ్లలో ఏఐ పాఠాలు.. 5 వేల బడుల్లో అమలు

హైదరాబాద్​, వెలుగు:ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) వాడకంలో తెలంగాణ ఓ ఎగ్జాంపుల్​గా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏఐ సహకారంతో పాలనను చేయాలని నిర్ణయించింది. ప్రజలకు పథకాల ఫలాలను అందించడం, సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన చదువును చెప్పించడం, ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచడం, నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచడం, ప్రతి ఒక్కరికీ ఏఐని చేరువచేయడం, వ్యవసాయానికి ఏఐని అనుసంధానించడం, అన్ని డిపార్ట్​మెంట్లలోనూ ఏఐని అమలు చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.

అందులో భాగంగా ఏఐపై ఓ రోడ్​ మ్యాప్​ను  గురువారం ఏఐ గ్లోబల్​ సమిట్​లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2027 నాటికి కోటి మంది లబ్ధి దారులకు ఏఐ ద్వారా సేవలు అందించాలని ఇందులో నిర్ణయించింది. 2025 చివరి నాటికి 2 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ ద్వారా ప్రొడక్టివిటీని పెంచేలా శిక్షణ ఇవ్వనుంది. ఏఐ సిటీని నిర్మించి జిల్లాల్లోని లోకల్​ ట్యాలెంట్​ను వెలికి తీయనుంది. ప్రైవసీతో డేటా ట్రాన్స్​ఫర్​ కోసం ప్రత్యేకంగా తెలంగాణ డేటా ఎక్స్​చేంజ్​ ప్లాట్​ఫాంను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వివిధ శాఖలు, విభాగాల మధ్య డేటా ఎక్స్​చేంజ్​ను అత్యంత కచ్చితత్వం, సేఫ్టీతో నిర్వహించనుంది.

వ్యవసాయం, హెల్త్​కేర్​, అర్బన్​ మొబిలిటీ, స్కీములను అందించడం వంటి శాఖల్లో ఈ డేటా ఎక్స్​చేంజ్​ ప్లాట్​ఫాం పనిచేస్తుంది. సీఎం ఆఫీస్​ కేంద్రంగా ఓ అడ్వైజరీ కౌన్సిల్​ను ఏర్పాటు చేయనుంది. ఈ అడ్వైజరీ కౌన్సిల్​.. వివిధ విభాగాల్లో ఏఐని వాడుకునే విధానాలపై సీఎం ఆఫీసుకు విధాన నిర్ణయాలు, వ్యూహాలపై సలహాలు ఇవ్వనుంది. అంతేగాకుండా వివిధ శాఖలను గైడ్​ చేస్తుంది. వాటితో పాటు విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలకూ గైడెన్స్​ను ఇస్తుంది.

ఏఐ అడ్వైజరీ కౌన్సిల్​ ప్రధాన బాధ్యతలు

  • ఏఐలో ఇంపాక్ట్​కు సంబంధించి కొలాబరేషన్​ను ప్రమోట్​ చేయడం
  • అడ్వాన్స్​ ఏఐ రీసెర్చ్​ అండ్​ ఇన్నొవేషన్​ను అభివృద్ధి చేయడం
  • డేటా ప్రమాణాలు, విధానాలను ప్రభావవంతంగా వాడుకోవడం
  • ఏఐ స్కిల్​, ట్యాలెంట్​ డెవలప్​మెంట్​ను ప్రోత్సహించడం
  • బాధ్యతాయుతంగా ఏఐని వాడుకునేలా విధానాలను తీసుకోవడం
  • భవిష్యత్​ ఏఐ సిటీని సిద్ధం చేయడం 

ఏఐ అడ్వైజరీ కౌన్సిల్​లో రెండు విభాగాలు

తెలంగాణ ఏఐ అడ్వైజరీ కౌన్సిల్​లో రెండు విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏఐ రీసెర్చ్​ అండ్​ కొలాబరేషన్​ నెట్​వర్క్​, ఎమర్జింగ్​ టెక్నాలజీస్​ వింగ్​అండ్​ ఐటీ అండ్​ సీ  ఉంటాయి. ఏఐ ఎకో సిస్టమ్​లో భాగంగా పలు విద్యా సంస్థలు, స్టార్టప్​లు (కృత్రిమ్​, లోకస్​, సర్వం ఏఐ), మెటా, గూగుల్​ వంటి పెద్ద సంస్థలతో అవి కొలాబరేట్​ అయ్యి ఎప్పటికప్పుడు ఏఐకి సంబంధించిన గైడెన్స్​ను సీఎం ఆఫీసుకు చేరవేస్తుంటాయి.  సీఎం ఆఫీసుకు వచ్చిన డేటా ఆధారంగా ప్రభుత్వ శాఖలకు సీఎం ద్వారా ఏఐ వినియోగంపై సలహాలు సూచనలు వెళ్తాయి.

ఎమర్జింగ్​ టెక్నాలజీస్​లో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ఎమర్జింగ్​ టెక్నాలజీ వింగ్​ను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏఐ అడ్వైజరీ కౌన్సిల్​ గైడెన్స్​లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏఐ ఆధారిత వ్యూహాలు, విధానాలను ఎమర్జింగ్​ టెక్నాలజీ వింగ్​ అమలు చేస్తుంది. అడ్వైజరీ కౌన్సిల్​లోని మరో విభాగం ఏఐ రీసెర్చ్​ అండ్​ కొలాబరేషన్​ నెట్​వర్క్​.. ఐఐటీ హైదరాబాద్​, జేఎన్​టీయూ, ఎన్​ఐటీ వరంగల్​, ఇతర విద్యా సంస్థలు, అమెజాన్​, మైక్రోసాఫ్ట్​, మెటా వంటి సంస్థలతో కొలాబరేట్​ అయ్యి ఏఐని మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తుంది.

ఆయా సంస్థల్లోనే ఇంటర్నల్​గా స్పోక్స్​ (సబ్​ విభాగాలు) ఏర్పాటు చేసి ఏఐ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ద్వారా కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సర్కారు నిర్మించనున్న ఏఐ సిటీలోనే ఏఐ రీసెర్చ్​ అండ్​ కొలాబరేషన్​ నెట్​వర్క్​ను ఓ హబ్​గా ఏర్పాటు చేస్తారు.   

ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్​ ప్రోగ్రామ్​

ప్రభుత్వ ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచేందుకు కెపాసిటీ బిల్డింగ్​ ప్రోగ్రామ్​ను ఏఐ ద్వారా ప్రభుత్వం అందించనుంది. లెటర్లు రాయడం, జీవోలు ప్రిపేర్​ చేయడం, వివిధ నివేదికలపై వివరణాత్మక నోట్స్​ను రాయడం వంటి వాటిపై సమగ్రమైన శిక్షణను ఇవ్వనుంది. తద్వారా 2025 చివరి నాటికి 2 లక్షల మంది ఉద్యోగుల ప్రొడక్టివిటీని 20 శాతం పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఏఐ, జెన్​ఏఐ టూల్స్​ ద్వారా ఉద్యోగులకు ఫిజిటల్​ పద్ధతిలో (ఫిజికల్​+ డిజిటల్​) శిక్షణ ఇస్తుంది. బ్రిటన్​లో అమలు చేస్తున్న గవర్నమెంట్​ డిజిటల్​ సర్వీస్​ స్ఫూర్తిగా దీనిని అమలు చేయనుంది. 

కంటెంట్​ రైటింగ్​: ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు, ఉత్తర్వులు, లేఖలపై సమగ్రమైన శిక్షణ.

ప్రాసెస్​ ఎఫిషియెన్సీ, క్వాలిటీ: మీటింగ్​ మినిట్స్​ను తయారు చేయడం, డాక్యుమెంట్​లో లోపాలను సరిదిద్దడం, ఓసీఆర్​ ద్వారా టెక్ట్స్​ను తీయడం వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ.

డేటా అనాలిసిస్: ప్రభుత్వ ఖర్చులు ట్రెండ్స్, లబ్ధి దారులకు ఫలాలు అందుతున్న విధానాలను విశ్లేషించడంపై శిక్షణ.

ఏఐ పవర్​గా ప్రభుత్వం

అన్ని శాఖల్లోనూ ఏఐని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా ప్రభుత్వాన్నే ఏఐ పవర్​గా మార్చాలని నిర్ణయించుకుంది. ఏఐ ద్వారా పాలసీలను రూపొందించి వాటిని ప్రజలకు చేరవేయాలని నిర్ణయించింది. ఈ – గవర్ననెన్స్​ను ఏఐ ద్వారా ముందుకు నడిపించనుంది. సింగపూర్​లో అనుసరిస్తున్న నేషనల్​ ఏఐ స్ట్రాటజీని ఆదర్శంగా తీసుకుని ఈ – గవర్నెన్స్​లో ఏఐని తీసుకువస్తున్నది. వివిధ రంగాల్లో ఆ దేశ ప్రభుత్వం ఏఐని వాడుతున్న  విధానాలపై స్టడీ చేసి మన రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్టు దానిని వాడుకోవాలని నిర్ణయించింది.  

స్కీములు, సేవలు: దాదాపు 80 లక్షల మంది లబ్ధి దారులకు ఏఐ ద్వారా స్కీములను అందించనుంది. లబ్ధిదారులకు స్కీములను సమర్థవంతంగా ఏఐ ద్వారా అందించేందుకు టీ యాప్​ను బలోపేతం చేస్తుంది. దీని ద్వారానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. 

సిటీ ట్రాన్స్​పోర్ట్​, ట్రాఫిక్​: ట్రాఫిక్​ను ఎప్పటికప్పుడు మానిటర్​ చేసి కంట్రోల్​ చేసేందుకు ఏఐ ఆధారిత ట్రాఫిక్​ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తారు. రియల్​ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్​ ఫ్లోను అది అసెస్​ చేసి ఎక్కడ జామ్​ అయింది.. రోడ్లు ఎక్కడ ఫ్రీగా ఉన్నాయి.. వంటి వాటిని సిటీ అంతటా ఏర్పాటు చేసిన వ్యవస్థతో అది కో ఆర్డినేట్​ చేస్తుంది. తద్వారా ట్రాఫిక్​ను కంట్రోల్​ చేసేందుకు వీలు కల్పిస్తుంది. 40 లక్షల మంది వరకు దీని వల్ల లబ్ధి పొందుతారు. 

వ్యవసాయానికి ఊతం: పొలాల సారం తెలుసు కునేందుకు పర్సనలైజ్డ్​ అలర్ట్స్, సలహాలు ఇచ్చేం దుకు ఓ టూల్​ను ఏర్పాటు చేస్తారు. 30 లక్షల మంది లబ్ధి పొందేలా దీనికి రూపకల్పన చేస్తారు. 

టెలీ మెడిసిన్​: 21 లక్షల మందికి టెలీ మెడిసిన్​ సేవలను అందించే లక్ష్యంతో దీనిని తీసుకొస్తున్నారు. బేసిక్​ హెల్త్​ అడ్వైజ్​, ఆరోగ్య సమస్యల గురించి ప్రభుత్వ ఆస్పత్రులు, హెల్త్​ డిపార్ట్​మెంట్​కు తెలియజేసేలా ఏఐ ఆధారిత టెలీ మెడిసిన్​ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

వ్యాధుల నిర్ధారణ: 70 లక్షల మందికి ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేయనున్నారు. జబ్బుల ప్రభావం అధికంగా ఉన్న వారిని దీని ద్వారా స్క్రీన్​ చేసి పర్సనలైజ్డ్​ ట్రీట్​మెంట్​ అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

విద్యా అసెస్​మెంట్​: వివిధ సబ్జెక్టుల్లో ప్రైమరీ విద్యార్థుల అవగాహన, పర్ఫార్మెన్స్​ను తెలుసుకునేందుకు మొబైల్​ అప్లికేషన్​ ద్వారా విద్యార్థులను ప్రశ్నలు అడిగి అసెస్​ చేస్తారు. 12 లక్షల మందికి ఉపయోగపడేలా దీనిని డెవలప్​ చేస్తారు. 

ఔట్​బ్రేక్​ మిటిగేషన్​: వ్యాధులు విజృంభించే ప్రదేశాలను గుర్తించి అధికారులకు సమాచారాన్నిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

కెరీర్​ కౌన్సెలింగ్​: విద్యార్థుల మానసిక స్థితిగతులు, కెరీర్​ సలహాలు ఇచ్చేందుకు సీనియర్​ సెకండరీ స్థాయి విద్యార్థులకు చాట్​బాట్​, హెల్ప్​లైన్​ సేవలను అందిస్తారు. పది లక్షల మంది లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. 

అడాప్టివ్​ లెర్నింగ్​ : సీనియర్​ సెకండరీ ఎడ్యుకేషన్​లో విద్యార్థుల పెర్ఫార్మెన్స్​ ఆధారంగా.. వారికి స్కిల్స్​ పెంచేందుకు పర్సనలైజ్డ్​ లెర్నింగ్​ మాడ్యూల్​ను క్రియేట్​ చేస్తారు. జేఈఈ, నీట్​ వంటి వాటికి సన్నద్ధం చేస్తారు. దీని వల్ల 8 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.