
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న అసెంబ్లీలో బీసీ కులగణనకు సంబంధించి చర్చించి, కీలక వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభా, వారి ఆర్థిక-సామాజిక పరిస్థితుల గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ కులగణన ఎంతో కీలకమని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.
ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక, సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వేలకు సంబంధించిన విధాన నిర్ణయాలు, షెడ్యూల్డ్ కులాల సబ్ క్లాసిఫికేషన్కు సంబంధించిన సిఫార్సులను ఆమోదించడం, సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గుర్తింపు అవార్డులు, సంక్షేమ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాలను సమన్వయం చేయనుంది. ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ శాఖలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సామాజిక న్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.