2025 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన సెలవుల జాబితాను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది 27 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులను ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ( నవంబర్ 9, 2024 ) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ జాబితా ప్రకారం సెలవులను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.రెండో శనివారాల్లో, ఆదివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2025 సెలవు ప్రకటించిన క్రమంలో ఫిబ్రవరి 8, 2025 ( రెండో శనివారం ) న పనిదినంగా ప్రకటించింది ప్రభుత్వం. 5 సాధారణ సెలవులు ఆదివారం రోజున రాగా.. మార్చి నెలలో ఒక్క సాధారణ సెలవు కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షనల్ సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వాడుకోవాలని తెలిపారు. తమ ఇష్టానుసారం మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఆప్షనల్ హాలిడేస్ ను ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు.
అయితే దీనికోసం సంబంధిత పై అధికారికి ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. తమ ఉద్యోగులకు సెలవులపై సం బంధిత సంస్థలే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయని తెలిపారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మార్చబడతాయని తెలిపారు.