కృష్ణా నీళ్లు సరిపోవన్నట్టు గోదావరి నీళ్లనూ మళ్లిస్తున్న ఏపీ..

కృష్ణా నీళ్లు సరిపోవన్నట్టు గోదావరి నీళ్లనూ మళ్లిస్తున్న ఏపీ..

కృష్ణా నీళ్లు సరిపోవన్నట్టు గోదావరి నీళ్లనూ ఔట్ సైడ్ బేసిన్​కు ఏపీ మళ్లించుకుపోతున్నదని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 100 టీఎంసీలు, చింతలపూడి లిఫ్ట్ ద్వారా 27 టీఎంసీల నీటిని మళ్లిస్తున్నదన్నారు. ఏపీ తరలిస్తున్న ఆ గోదావరి జలాలకు సమానంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు కేటాయింపులు చేయాలన్నారు. 

కృష్ణా నదీ జలాల్లో పెన్నా బేసిన్​కు 75 శాతం డిపెండబిలిటీతో 98 టీఎంసీలు, యావరేజ్ డిపెండబిలిటీలో 195 టీఎంసీలను తరలిస్తున్నదని చెప్పారు. కృష్ణాలో డ్రైన్ల ద్వారా కృష్ణా డెల్టాకు 75 టీఎంసీల నీటి లభ్యత ఉంటున్నదని, అందులో కొంత భాగం తెలంగాణకు కేటాయించాలన్నారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ అభివృద్ధితో కృష్ణా డెల్టా సిస్టమ్​లో కొంత ఆయకట్టు తగ్గిందని, ఆ మేరకు ఏపీలో నీటి వాడకం కూడా తగ్గిందని, ఆ జలాలను తెలంగాణకు ఇవ్వాలని కోరారు.

కృష్ణా జలాలను ఏపీ అడ్డదారిలో ఔట్ సైడ్ బేసిన్​కు తరలించుకుపోతున్నదని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు తెలంగాణ వాదించింది. కృష్ణా బేసిన్​లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే.. ఏపీ మాత్రం విచ్చలవిడిగా ఔట్​సైడ్ బేసిన్​కు ఏటా 323 టీఎంసీలను తరలించుకుపోతున్నదని తెలిపింది. అవసరం ఉన్న వారికి నీటిని ఇవ్వాలిగానీ.. అవసరం తీరి దురాశతో ఎదురుచూసే వారికి కాదని పేర్కొంది. వర్షాకాలంలోనూ తెలంగాణ రైతులు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. ఏపీ మాత్రం యథేచ్ఛగా కృష్ణా పరివాహకంలోనే లేని ప్రాంతాలకు నీటిని తరలించుకెళ్లిపోతున్నదని ఆక్షేపించింది.