రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు

రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
  • ఎకరం వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది అకౌంట్లలో జమ
  • ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు.. రూ.1,126.54 కోట్లు చెల్లింపు 
  • టాప్​లో నల్గొండ.. రెండో ప్లేస్​లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు 

హైదరాబాద్, వెలుగు: ఎకరం వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా వేసింది. బుధవారం 17.03 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. రైతుభరోసా ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 32 జిల్లాల్లోని 21.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.1,126.54 కోట్ల నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 1.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.88.48 కోట్ల నిధులు జమయ్యాయి.

 ఇప్పటివరకు రైతు భరోసా అందిన జిల్లాల్లో నల్గొండ టాప్ లో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో సిద్దిపేట(1.20 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.63.76 కోట్ల నిధులు) సూర్యాపేట (96 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.61.58కోట్ల నిధులు) జిల్లాలు ఉన్నాయి. అలాగే, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్​ఫర్​ద్వారా జమయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలో మూడు కోట్ల 54 లక్షలు మాత్రమే రైతులకు అందాయి. ఆ తరువాత ములుగు, కుమ్రం భీం జిల్లాలు తక్కువ నిధులు జమ అయిన వాటిలో ఉన్నాయి.

వానాకాలంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి..

ఈ వానాకాలం సీజన్​లో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కోనుగోలు చేస్తున్నదని తెలిపారు. గత యాసంగిలో రూ.10,547 కోట్లు చెల్లించి 48.06 లక్షల టన్నులు.. వానాకాలంలో రూ.12,178.97 కోట్లు ఖర్చు చేసి 52.51 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. అంతేకాకుండా రూ.1,154 కోట్లు సన్న ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తుందని ప్రకటించారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తులు చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఎరువుల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామన్నారు.

మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం రైతులకే: మంత్రి తుమ్మల

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములు కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లలో బుధవారం రైతుభరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర​రావు తెలిపారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం రైతేనని స్పష్టం చేశారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించడానికి కృతనిశ్చయంతో ఉందన్నారు. అలాగే, ఇప్పటికే రైతుబంధుకు రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు బీమాకు రూ.3 వేల కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 టన్నుల పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. పత్తిపంటను పూర్తిగా సేకరించడానికి కేంద్రాన్ని గడువు కోరినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.406.24 కోట్లతో సోయాబీన్, పెసలు, కందులను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు కోనుగోలు చేసినట్టు వివరించారు.