- సర్వాయి పాపన్న కోట కూలి ఆరు నెలలు.. ప్రభుత్వం పట్టించుకుంటలె
- రిపేర్ పనుల్లో తీవ్ర జాప్యం
- ఇండ్లు కూలిన బాధితుల గోడు పట్టిం చుకోని సర్కారు
- హాస్టల్ లో తలదాచుకుంటే ఖాళీ చేయండని ఆర్డర్
‘సర్వాయి పాపన్న కోటను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలే. 50 ఏండ్ల కిందే రిపేర్లు చేయాల్సి ఉండే. ఆంధ్రా పాలకులు తెలంగాణ వీరుల చరిత్రను పట్టించుకోలే. కుట్రతో చారిత్రక కట్టడాలకు పైసా ఖర్చు చేయలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగనే సీఎం కేసీఆర్ వీరులను చరిత్ర పుటల్లో నిలుపుతున్నరు. ఖిలాషాపూర్, జాఫర్‌గడ్ తదితర కోటల రిపేర్లకు నాలుగైదు కోట్ల ఫండ్స్రిలీజ్ చేసిన్రు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకూ సర్కారు రెడీగా ఉంది. సర్వాయి పాపన్న చరిత్రను కాపాడుతం. కోటకు మరమ్మతులు చేస్తం’
– గతేడాది అక్టోబర్ 16న కోట సందర్శన టైంలో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జనగామ, వెలుగు: బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చారిత్రక ఆనవాళ్లను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లోని పాపన్న కోట బురుజు కూలి ఆర్నెళ్లయినా కనీసం తట్టెడు మట్టిని కూడా తీయలేదు. తెలంగాణ వీరులు, వీర వనితలు, యోధులు, చారిత్రక కట్టడాలపై ఆంధ్రా పాలకులు పైసా ఖర్చు చేయలేదని పదే పదే చెప్పిన తెలంగాణ సర్కారు తీరు.. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు మారింది.
పట్టింపేదీ?
ఖిలాషాపూర్‌లోని సర్వాయి పాపన్న కోట బురుజు గతేడాది అక్టోబర్ 15న కూలింది. ఆ రోజు పొద్దున్నుంచే నెర్రలు రావడం.. వాటి ఎడం పెరిగి శబ్దాలు వినిపించడంతో దగ్గర్లోని 6 ఇండ్లను ఉదయమే ఖాళీ చేశారు. ఆ తర్వాత నెర్రెల ఎడం పెరిగి కోట లోపలి వైపు వంగిపోతూ బురుజు కూలింది. ఈ ఘటనలో 3 ఇండ్లు నేలమట్టమయ్యాయి. బయట వైపు పడితే మరిన్ని ఇండ్లు కూలేవని.. అదృష్టవశాత్తు అలా జరుగలేదని ఖిలాషాపూర్ గ్రామస్తులు చెప్పారు. తర్వాత రోజు ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖిలాషాపూర్ వచ్చి కోట కూలిన ప్రాంతాని పరిశీలించారు. కోటను పునరుద్ధరిస్తామన్నారు. కానీ నేటికీ రిపేర్ పనులు మొదలు కాలేదు. సర్కారు నిర్లక్ష్యంతో చారిత్రక కట్టడం కళావిహీనంగా మారింది.
పనులు టెండర్ దశలో ఉన్నాయట
కోట రిపేర్ల కోసం రూ 1.26 కోట్లు మంజూరయ్యాయని, పనులు టెండర్ దశలో ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పనులెప్పుడు స్టార్టవుతాయంటే స్పష్టతనివ్వట్లేదు. 2017 ఏప్రిల్‌లో పాలకుర్తి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు జిల్లాలోని పెంబర్తి, పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, ఖిలాషాపూర్, జఫర్‌ఘడ్‌లను టూరిజం సర్క్యూట్‌గా చేస్తామన్నారు. ఇందుకోసం రూ. 40 కోట్లను మంజూరు చేస్తామన్నారు. ఇందు రూ 4.50 కోట్లను ఖిలాషాపూర్ కోట డెవలప్‌మెంట్‌కు కేటాయించారు. కానీ ఆ పనులు స్లోగా సాగాయి. కోట పగుళ్లు, రంధ్రాలు వచ్చిన చోట మూయడం, కోట ఆవరణలోని చెట్లను తొలగించడం వంటి పనులను చేసి చేతులు దులుపుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
హాస్టల్ ఖాళీ చేయాలట
కోట బురుజు కూలిన ఘటనలో జిట్టె వెంకటయ్య, వీరస్వామి, చిన్న వీరస్వామి ఇండ్లు నేలమట్టం కాగా ఆవుల మల్లమ్మ ఇల్లు దెబ్బతింది. దీంతో బాధిత కుటుంబాలు అదే ఊర్లోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో తలదాచుకుంటున్నాయి. అప్పట్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రెవెన్యూ ఆఫీసర్లు బాధితులను పరామర్శించారు. రూ. 90 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి అందించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. అయితే నేటికీ హామీ నెరవేరలేదు. పైగా స్టూడెంట్స్ వస్తారని హాస్టల్ ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఆఫీసర్లను కలిసి వేడుకుంటే ఇండ్లు వచ్చినప్పుడు ఇస్తామంటున్నారని చెబుతున్నారు.
ఎక్కడికి పోవాలె?
చూస్తుండగానే కోట బురుజు మీద పడి మా ఇల్లు కూలింది. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య, ఆఫీసర్లు వచ్చిన్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తమన్నరు. ఇప్పటివరకు సప్పుడు లేదు. ఊర్లోని హాస్టల్‌లో ఉంటుంటే ఈ మధ్య ఆఫీసర్లు వచ్చి ఖాళీ చేయమంటున్నరు. ఎక్కడికి పోవాలె.. ఏడ ఉండాలె.
– జిట్టె లక్ష్మి, బాధితురాలు
బతుకులు రోడ్డున పడ్డయ్
కోట బురుజు కూలి బతుకులు రోడ్డున పడ్డయ్. ఇల్లు లేక హాస్టల్‌లో తలదాచుకుం టే ఇక్కడా ఖాళీ చేయమంటున్నరు. ఊర్లో ఇండ్లు కిరాయికి దొరికే పరిస్థితి లేదు. ఆఫీసర్లను అడిగితే పట్టించుకుంట లేరు.
– జిట్టె కవిత, బాధితురాలు