- సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామని మరిచిన సర్కార్
- సరైన సౌకర్యాలు లేక పేషెంట్ల అవస్థలు
- అరకొర ఆక్సిజన్ సప్లైతో అష్టకష్టాలు
- గంటకు 25 నుంచి 30 మంది దాకా చేరుతున్నరు
- బెడ్లు చాలక, సిబ్బంది లేక దయనీయ పరిస్థితులు
- ఆస్పత్రిలో 12 గంటల్లో 23 మంది పేషెంట్లు మృతి
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) పరిస్థితి ఘోరంగా తయారైంది. సరైన సౌకర్యాల్లేక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. అరకొర ఆక్సిజన్ సప్లైతో అల్లాడుతున్నారు. సమయానికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, గంట గంటకూ పేషెంట్లు పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులు సతమతమవుతున్నారు.
వెయ్యి కోట్లు ఇస్తమన్నరు
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో గాంధీ హాస్పిటల్ ను కొవిడ్ నోడల్ సెంటర్‌గా మార్చారు. కేసులన్నీ అక్కడికే వెళ్లేవి. కరోనా తీవ్రత పెరిగాక కొన్ని హాస్పిటళ్లలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని 14 అంతస్థుల భవనంలో టిమ్స్ ఏర్పాటు చేసి గాంధీకి సమాంతరంగా కరోనా హాస్పిటల్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్లుగా కొన్ని ఏర్పాట్లూ చేసింది. టిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామని ప్రకటించింది. 1,224 బెడ్లు ఉన్న ఈ ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం రూ. 1,000 కోట్లను కేటాయిస్తామంది. వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తామని, 50 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉంచుతామని చెప్పింది. కానీ ఇవి ప్రకటించి ఏడాదైనా వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం కేసులు పెరిగి పేషెంట్ల తాకిడి ఎక్కువవడంతో బెడ్లు లేక వెనక్కి పంపిస్తున్నారు. టైంకు ఆక్సిజన్ అందక గురువారం రాత్రి నుంచి 12 గంటల్లో 23 మంది మరణించారు.
టిమ్స్ లో 137 ఐసీయూ బెడ్లు
సెకండ్ వేవ్ సమయంలో కేసులు పెరుగుతుండటంతో టిమ్స్‌కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా పేషెంట్లు వస్తున్నారు. శుక్రవారం ‘వెలుగు’ విజిట్ సమయంలో గంటకు 25 నుంచి 30 మంది పేషెంట్లు వచ్చారు. ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్లను చేర్చుకుంటున్నామని, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్లకు కరోనా కిట్ ఇచ్చి హోం ఐసోలేషన్‌కు వెళ్లమని సూచిస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారు. అయితే 14 అంతస్తుల టిమ్స్ బిల్డింగ్‌లో ప్రస్తుతం 8 ఫ్లోర్లనే హాస్పిటల్ కోసం వాడుతున్నారు. ఇందులో మొదటి 3 ఫోర్లలో ఆక్సిజన్ సౌకర్యం బాగుంది. వేరే ఫోర్లలో ఆక్సిజన్ బెడ్లు ఉన్నా తగినంత సప్లై లేదని తెలిసింది. ‘ప్రతి ఫ్లోర్లో 60 బెడ్లు ఉన్నాయి. అందులో 20 మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి' అని అక్కడి నర్సు ఒకరు తెలిపారు. హాస్పిటల్‌కు వస్తున్న పేషెంట్ల సంఖ్య చూస్తుంటే ఈ బెడ్లు ఏమాత్రం సరిపోవన్నారు. టిమ్స్‌లో 137 ఐసీయూ బెడ్స్ ఉన్నాయని, 800 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఐసీయూ బెడ్స్ ఫుల్ అయ్యాయని, 30 మాత్రం ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉంచామని తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా ఉన్నాయంటున్నా అన్నింటికీ సరిపోయేంత సప్లై లేదని అక్కడి స్టాఫ్ ద్వారా తెలిసింది.
స్టాఫ్ కొరతతో సతమతం
మొదటి నుంచి స్టాఫ్ కొరతతో టిమ్స్ సతమతమవుతోంది. ఫస్ట్ వేవ్ సమయంలోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరైనంతగా లేకపోవడంతో హడావుడిగా రిక్రూట్ చేశారు. ఆ తర్వాత కరోనా తగ్గడంతో చాలా మందిని తొలగించారు. మళ్లీ సెకండ్ వేవ్ రావడంతో 4 రోజుల కింద మరోసారి రిక్రూట్ చేసుకున్నారు. ఈ సారీ చాలా మంది ఉద్యోగం కోసం వచ్చారు. కానీ 20 మంది డాక్టర్లు, 20 మంది నర్సులను తీసుకున్నారు. ప్రస్తుతం టిమ్స్‌లో 120 మంది డాక్టర్లు, 310 మంది స్టాఫ్ నర్సులు, 30 మంది హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. 50 మంది పేషెంట్ కేర్ సర్వీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇపుడు హాస్పిటల్‌కు వస్తున్న పేషంట్ల సంఖ్యకు ఈ స్టాఫ్ ఎటూ సరిపోరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
తగినంత ఆక్సిజన్ సప్లై లేదు
గాంధీతో పాటు వేరే హాస్పిటళ్ల నుంచి కూడా పేషెంట్లు టిమ్స్ కు వస్తుండడంతో బెడ్లన్నీ ఫుల్ అయ్యాయని, కొన్ని బెడ్లు ఉఃన్నా సర్వీసు చేసేందుకు అవసరమైన సిబ్బంది లేరని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఆక్సిజన్ సప్లై కూడా తగినంత లేదని, దీంతో సీరియస్ పేషెంట్లనూ వెనక్కి పంపాల్సి వస్తోందని అంటున్నారు. వాస్తవ పరిస్థితిని చెప్పి కొందరిని గాంధీకి పంపిస్తుండగా మరికొందరు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లిపోతున్నారు. గాంధీకి సమాంతరంగా టిమ్స్ డెవలప్ చేయాల్సిన ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పేషెంట్లకు సమయానికి ఫుడ్ కూడా అందించలేని పరిస్థితి ఉండేదన్నారు. మరో రెండు, మూడు వారాల్లో పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అప్పుడేం చేయాలో అర్థం కావట్లేదని అంటున్నారు.