నిజానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు, పాలకులను నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రజా నిరసనను పట్టించుకుని పరిష్కారానికి ప్రయత్నించాలి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగులు బాగుంటారు, కార్మికుల హక్కులకు ఎలాంటి దెబ్బ తగలదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అందరం భావించాం. కానీ, ప్రశ్నించినవాళ్లను అణిచేయడానికి పనికి వచ్చే పోలిసుల బలోపేతమయ్యారు తప్ప, తెలంగాణ ప్రభుత్వంలో ఎవ్వరికీ న్యాయం జరగడం లేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చూస్తే…
- మునిసిపల్ కార్మికుల సమ్మెను పట్టించుకోలేదు.
- ఆశా వర్కర్ల సమ్మెను అణిచివేశారు.
- 108 ఉద్యోగుల నిరసనను గాలికి వదిలేశారు.
- గోపాల మిత్రల దీక్షలను పోలీసులతో భగ్నం చేశారు.
- ఆర్టీసీ సమ్మెను అసలు పరిష్కరించడానికి చూడడం లేదు.
- ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు. విలీనాల పేరుతో అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట ప్రశ్నించే గొంతులు
నొక్కేస్తున్నారు.
ఏ ఉద్యమకారుడైనా ఎదుటివారి ఉద్యమాలను గౌరవిస్తారు. కేసీఆర్ మాత్రం ఉద్యమాలను అణిచివేస్తారు. ఉద్యమ నాయకులను పనికిమాలినవాళ్లుగా అవమానిస్తారు. ‘ఉద్యమ కాలంలో 1,200మంది విద్యార్థులు చనిపోయారు’ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక 400 మందే అని మాట మారుస్తారు. ‘అమరుల స్మారకంగా ఈఫిల్ టవర్ను మించింది నిర్మిస్తాన’ని ప్రకటించి, అధికారం రాగానే కనీసం అమరులను గుర్తు చేసుకోరు. ‘ఇంటికో ఉద్యోగం అని నేనెన్నడూ అనలేద’ని మాట మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఒక్క మనిషి–100 నాలుకలు’ అన్నట్లు మాట్లాడుతారు కేసీఆర్.
టీఆర్ఎస్ ప్రభుత్వం 30 సంఘాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి ఒక సంస్థను నిషేధించాలంటే ఆ సంస్థ చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, హింస, అరాచకాలు, రాజ్యాంగ వ్యతిరేక పనులు వంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా ఎలా నిషేధిస్తారు? ప్రజలకోసం ప్రశ్నిస్తే ఏదో ఒక నిషేధిత సంస్థకు అంటగట్టి కేసులు బనాయించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతోంది.
తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ చేసిన ఉద్యోగులు కూడా అవమానాలకు గురవుతున్నారు, రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ ప్రకటనలతో ఆందోళనలో ఉన్నారు, నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు, టీచర్లు అసంతృప్తితో ఉన్నారు, భవిష్యత్తు పట్ల స్టూడెంట్లు భరోసా కోల్పోతున్నారు, ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏక తాటి మీదికి తెచ్చిన టీఎన్జీవో నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆర్టీసీ సమ్మె మొదలవగానే ఉద్యోగ, కార్మిక సంఘాలలో చీలిక తేవడానికి నిమిషాలలో అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేసి నాటి పాలక వర్గానికి ఎదురు తిరిగి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డారు. అలాంటివాళ్లను ఈ రోజున పురుగులకంటే హీనంగా చూస్తున్నారు. నెల రోజులముందే సమ్మె నోటీసు ఇస్తే కనీసం పిలిచి మాట్లాడని ముఖ్యమంత్రి… సమ్మె మొదలయ్యాక వారిపై ప్రజా ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు 48,000 మందిని డిస్మిస్ చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులను క్షమించేది లేదని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఎవరు? ఎవరు ఎవరిని క్షమించాలి? ప్రజలలో ఆర్టీసీ కార్మికులు ఒక భాగం. వాళ్లు తమ హక్కులకోసం సమ్మె చేస్తే క్షమించేది లేదనడం దొర అహంకారానికి ప్రతీక కాదా? ఆర్టీసీ కార్మికులు చేసిన నేరం ఏంటి? ‘క్షమించము’ అనడానికి మీకున్న అధికారం ఏంటి? ఎన్నికల్లో గెలిచినంతమాత్రాన పాలకులకు ప్రజలు బానిసలా?
తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శించడానికి ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పార్టీవారు వెళ్ళారు, కాని స్వపరిపాలనలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకుంటే, వారిలో రవాణా శాఖ మంత్రి సొంత జిల్లా కార్మికుడు ఉన్నా ప్రభుత్వం తరఫున ఒక్కరుకూడా పరామర్శించలేనంత కాఠిన్యమా? ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమికొట్టాలి. ప్రాంతంవాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరపెట్టాలి’ అన్న కాళోజీ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
ఆనాటి సమైక్య పాలకులు ఇలా నియంతల్లా ఉన్నట్లయితే… రాస్తారోకోలు, రైలు రోకోలు, వంటా-వార్పులు, సకల జనుల సమ్మెలు, సాగర హారం, మిలియన్ మార్చ్ జరిగేవా? ఇప్పుడు సమ్మెలు చేస్తున్నవారి మీద కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరులో సమైక్య పాలకులు ఎన్నడూ చెయ్యలేదు. మొన్న వరంగల్లో అమరవీరుల స్తూపం సాక్షిగా ఒక మహిళా కండక్టర్ కొంగు లాగిన సంఘటన సిగ్గుచేటు కాదా? సమ్మె చేస్తున్నవాళ్లను డిస్మిస్ చేశామన్నారు సరే, మరి మహిళ కొంగు లాగిన పోలీస్ అధికారి మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇలాంటి దుశ్శాసన పర్వాలు ఇంకా చేయమని ప్రోత్సహించడమా?
దనసరి అనసూయ
(సీతక్క),
ములుగు ఎమ్మెల్యే