ఎంతో మంది అమరుల ఆత్మబలిదానాలు, పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. కానీ రాష్ట్రం సాధించుకుని ఎనిమిదేండ్లు అవుతున్నా.. బీసీల బతుకుల్లో మార్పు రాలేదు. ఇంకా తెలంగాణ సమాజంలోని బీసీలు అనేక అసమానతలకు, అణచివేతలకు, నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీలకు అనేక హామీలు ఇచ్చినా వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. బడ్జెట్ లోనూ బీసీలకు పెద్దగా కేటాయింపులేమీ లేవు. వేలాది బీసీ బిడ్డలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఎన్నో బీసీ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటికి చైర్మన్లతోపాటు, డైరెక్టర్లను నియమించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, బీసీల్లో ఇప్పటికీ వెనకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్ర జనాభాలో 65 శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక పథకాలు, వారి సంక్షేమం, అభివృద్ధి ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసీ విద్యార్థులకు, మేధావులకు ఎలాంటి సబ్సిడీలు, లోన్ల మంజూరు లేదు. కుటీర పరిశ్రమల ఏర్పాటు, కుల వృత్తుల శిక్షణకు ప్రోత్సాహకాలు లేవు. నిరుద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. 65 శాతం ఉన్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 2.39 శాతం మాత్రమే నిధులు ప్రవేశపెట్టింది. కానీ మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సమాజంలో ఉన్నతమైన గౌరవం కల్పించడం కోసం బీసీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేయడం కోసం56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటన్నింటికి చైర్మన్లతో పాటు 12 మంది డైరెక్టర్లను కూడా నియమించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 139 బీసీ కులాలకు భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం సామాజిక న్యాయం జరుగుతోంది. ఇందులో 50 శాతానికిపైగా మహిళలకు స్థానం కల్పించడం మరో విశేషం. ఈ కార్పొరేషన్లకు దాదాపు13 జిల్లాలకు చెందిన మహిళలు ప్రాతినిథ్యం వహించారు. ఇందులో డైరెక్టర్లుగా, చైర్మన్ లుగానే కాకుండా నామినేటెడ్ పదవుల నియామకాల్లో కూడా మహిళలకు 50 శాతం స్థానం కల్పించారు.
బీసీల్లో ఇంకా వెనుకబడిన వర్గాలు..
దేశంలోని 9 రాష్ట్రాలు(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, బిహార్ తదితర రాష్ర్టాలు) బీసీ కులాలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించాయి. ‘ఏ’-లో ఆదిమ జాతులు, సంచార జాతులు, విముక్త జాతులు, అర్థ సంచార జాతులు, ‘బీ’-లో వృత్తి నైపుణ్యం కలిగిన జాతులు, ‘సీ’-లో కన్వెర్టెడ్ కులాలు, ‘డీ’-లో వ్యవసాయం, వ్యాపారం చేసుకునే వర్గాల వారు ఉన్నారు. ఈ వర్గీకరణ ద్వారా కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్లను, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రుణాలు పొందుతున్నాయి. ఇంకా చాలా కులాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. తరతరాలుగా రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాని రజక, వడ్డెర, పెరిక, నాయీ బ్రహ్మణ, దేవాంగ, యాత, గవర, దాసరి, మత్స్యకార వంటి కులాలు బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలు. ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి రాజ్యాధికారం పొందని, దేశ అభివృద్ధిలో భాగం కాని ఎన్నో వెనకబడిన కులాలకు ఈ కార్పొరేషన్లు ఉపశమనం కలిగిస్తాయి. బీసీలను ఉమ్మడి బీసీలుగా లేదా వర్గీకరించిన బీసీలుగా గుర్తించినప్పటికీ కేవలం కొన్ని కులాల వారే ఈ రిజర్వేషన్ల ద్వారా సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారు. అందుకే కార్పొరేషన్లుఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గంలో వెనకబడిన వారికి అన్ని విధాల మేలు చేయొచ్చు. బీసీ కార్పోరేషన్ల వల్ల బీసీలకు కులాల ప్రాతిపదికపై సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, చేనేత కుటీర పరిశ్రమల అభివృద్ధి, వృత్తి పరమైన శిక్షణ నిర్వహణ పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. బీసీ కులాలు ఎదుర్కొంటున్న వివక్షను, సమస్యలను గుర్తించి వారి రక్షణ కోసం తగిన చట్టాలు, సంక్షేమ పథకాలు అందించడానికి ఈ కార్పొరేషన్లు ఉపయోగపడుతాయి.
రాజకీయ చైతన్యం సాధ్యం..
దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలను ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకుగానే వాడుకుంటోంది. బీసీ కులాల మధ్య ఐఖ్యత లేకపోవడం వల్ల వారిని ప్రధాన కులాలుగా, ఉపకులాలుగా, మత ప్రతిపాదికన విభజించి పాలిస్తున్నాయి. కొత్తగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటైతే బీసీ కులాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా వారు ఐఖ్యత చాటి రాజకీయ అణచివేతను గుర్తించి చైతన్యం ప్రదర్శించగలుగుతారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖలో నేటికి కూడా జిల్లా స్థాయిలో కమిషనర్లు లేరు. బీసీ విద్యార్థులకు సంబంధించిన కళాశాలలు నిర్మించడం లేదు. ఇంటర్, డిగ్రీ స్థాయి హాస్టళ్లలో సరైన వసతులు లేవు. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. బీసీలను మరింత పేదరికంలోకి నెట్టివేసి వలసలు వెళ్లేలా పరిస్థితులను కల్పించడం వంటివి చూస్తుంటే ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం
కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.
మహిళలకు 50 శాతం స్థానాలు
కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి సంక్షేమం కోసం రుణాలు, పథకాలు అందించి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకురావొచ్చు. అంతే కాకుండా ఆయా కార్పొరేషన్లలో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించి వారిని ప్రత్యక్షంగా పరిపాలనలో భాగం చేయొచ్చు. తద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగి దేశంలోని ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతారు. బీసీ కులాల బిడ్డలను విద్యా రంగంలో ముందుకు నడిపించడానికి కావల్సిన ఆర్థిక వసతులు, విద్యా ప్రమాణాలు పెంచడం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు విడుదల చేసే నిధులు పక్క దారి పట్టకుండా బీసీలకే పూర్తి ఖర్చు చేసే వీలు కలుగుతుంది.
- దుండ్ర కుమార స్వామి, బీసీ దళ్, జాతీయ అధ్యక్షుడు