![అడ్డుకుంటామన్న సర్కార్.. అడుగు ముందుకేస్తలే](https://static.v6velugu.com/uploads/2021/06/Telangana-government-doesnot-care-block-the-AP-Sangameshwaram-project_q6ec1zS4mO.jpg)
- ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకుంటామన్న రాష్ట్ర సర్కారు
- 10 రోజులైనా అడుగు ముందుకు పడలే
- ఎన్జీటీలో వేసేందుకు పిటిషన్ సిద్ధమైనా.. పక్కన పెట్టేసిన్రు
- కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాయాలని సర్కారు యోచన
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న సంగమేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసులు వేస్తామని రాష్ట్ర సర్కారు చెప్పి పది రోజులైనా అడుగు ముందుకు పడలేదు. కేబినెట్ నిర్ణయం అమలవుతుందా లేక ఉత్తుత్తి ముచ్చటగానే మిగిలిపోతుందా అనే అనుమానం ఇరిగేషన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్జీటీలో ఫైల్ చేయడానికి ఇప్పటికే పిటిషన్ సిద్ధమైనా పక్కన పెట్టేశారు. నారాయణపేట్ జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఇటీవల విచారించిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది.ప్రాజెక్టు పనులు మొదలు పెట్టినట్టు తేలితే సీఎస్‌ను జైలుకు పంపుతామని ఘాటుగానే హెచ్చరించింది.
ప్రెస్‌మీట్లతో సరి..
రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ కుడి కాలవపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు, సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని ఈనెల 19న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని మంత్రులు పదే పదే చెప్తున్నారు. న్యాయపోరాటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రెస్‌మీట్లు తప్ప ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎలాంటి కార్యాచరణ సర్కారు నుంచి కనబడలేదు. కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ ఈ మధ్య లెటర్ రాయడంతో.. సంగమేశ్వరం ఆపాలని ఏపీని కేఆర్‌ఎంబీ ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వపరంగా ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిలువరించే ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు.
పిటిషన్ రెడీ.. కానీ..
సంగమేశ్వరం, ఆర్డీఎస్ కుడికాలువపై ఎన్జీటీలో కేసు దాఖలు చేయడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌ను అధికారులు పూర్తి చేశారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ఉల్లంఘనకు పాల్పడిన ఆధారాలతో పిటిషన్ రెడీ చేశారు. కానీ సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఆగిపోయారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయాలా, వద్దా అనే దానిపైనే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రైవేట్ పిటిషన్‌ను ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ విచారించిందని, కేసు వేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సుప్రీంలోనూ న్యాయపోరాటం చేయాలని అనుకున్నా దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలు పెట్టలేదు. మరోవైపు ఎన్‌జీటీలో పిటిషన్‌కు బదులు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు లేఖ రాయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్సార్బీసీ), తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్టులు 1985, 86 కాలంలో చేపట్టినవని, వాటి స్వరూపం పూర్తిగా మారిపోయిందనే విషయాన్ని కేంద్రానికి వివరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏపీ కొత్తగా ఎత్తిపోతలు చేపట్టడంతో పాటు, ప్రాజెక్టులో భాగంగా పలు కొత్త రిజర్వాయర్లు ప్రతిపాదించిందని, పలు కొత్త అంశాలు ఉండటంతో పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు తప్పనిసరి అని వివరించాలనే యోచనలో ఉంది.
రేపు సంగమేశ్వరం సందర్శనకు కృష్ణా బోర్డు
ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం సందర్శనకు బుధవారం కృష్ణా బోర్డు ఎక్స్‌పర్ట్ టీం వెళ్లనుంది. ప్రాజెక్టు సందర్శనపై సోమవారం జలసౌధలోని కేఆర్‌ఎంబీ చైర్మన్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ రెండు రోజుల క్రితం మౌఖిక ఆదేశాలివ్వడంతోపాటు.. ఏపీ ప్రాజెక్టు పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని బోర్డు పెద్దలను మందలించినట్టు తెలిసింది. దీంతో ప్రాజెక్టును విజిట్ చేయడానికి బోర్డు టీం రెడీ అవుతోంది. బోర్డు మెంబర్ హరికేశ్ మీనా ఆధ్వర్యంలోని బృందం పర్యటనకు నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురే.. ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు ఇప్పటికే లెటర్ రాశారు. ప్రాజెక్టు విజిట్‌కు ఏపీ సహకరించకపోవచ్చనే అభిప్రాయం బోర్డు పెద్దల్లో ఉంది. ఏపీ సహకరించకుంటే కేంద్ర బలగాల రక్షణలో వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం వరకు ఏపీ సమాధానం కోసం వేచి చూసి.. స్పందించకుంటే అదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్‌జీటీ ఆదేశాలతో కేఆర్‌ఎంబీ రెండు సార్లు ప్రాజెక్టు విజిట్‌కు ప్రయత్నించగా.. పలు సాకులు చెప్పి ఏపీ వారి పర్యటనను అడ్డుకుంది.