వాయిదా పద్ధతిలో ఎల్​ఆర్​ఎస్ క్లియరెన్స్​!

వాయిదా పద్ధతిలో ఎల్​ఆర్​ఎస్ క్లియరెన్స్​!
  • సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో చెల్లించేలా సర్కారు వెసులుబాటు
  • మార్చికల్లా రూ.2 వేల కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్ 
  • న్యూప్లాట్ నిర్వచనం​పైనా త్వరలో క్లారిటీ 

హైదరాబాద్, వెలుగు: ల్యాండ్​ రెగ్యులరైజేషన్​స్కీం(ఎల్ఆర్ఎస్) కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం యజమానులు పెట్టుకున్న అప్లికేషన్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న మున్సిపల్​శాఖ.. ఈ విషయంలో వెనకబడడంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు నిర్ణయించిన పెనాల్టీని ఒకేసారి కట్టడం యజమానులకు భారంగా మారడంతో వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించబోతోంది. ఇందులో భాగంగా కనీసం 25 శాతం పెనాల్టీని మొదటి వాయిదాలో కట్టించుకుని.. ఆ తర్వాత రెండు, మూడు వాయిదాల్లో పూర్తి పెనాల్టీ  చెల్లించే చాన్స్​ ఇవ్వనుంది.

అదే సమయంలో మున్సిపాలిటీలతో పాటు సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ పెనాల్టీలు చెల్లించి.. ఎల్​ఆర్​ఎస్​ చేసుకునే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన గత బీఆర్ఎస్​ సర్కారు ఎల్​ఆర్​ఎస్​ స్కీమును తెచ్చింది. ఇందులో భాగంగా 25.70 లక్షల ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ దరఖాస్తులు రాగా, మున్సిపల్​శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 9 లక్షల అప్లికేషన్లను పరిష్కరించారు. 

అందులోనూ క్రమబద్ధీకరణకు అనుమతించినవి కేవలం 1,73,000 మాత్రమేనని తెలిసింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండడం..  మూడు, నాలుగు శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి రావడంతో ఎల్​ఆర్​ఎస్​ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు సర్కారు గుర్తించింది. అదే సమయంలో ఎల్​ఆర్​ఎస్​ పెనాల్టీ ఒకేసారి కట్టేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. అనేక టెక్నికల్​ అంశాల్లో క్లారిటీ లేకపోవడంతో అప్లికేషన్లు పెండింగ్​లోనే ఉంటున్నాయి.

దీంతో సబ్ రిజిస్ట్రార్లకూ ఎల్​ఆర్​ఎస్​ క్లియరెన్స్​ బాధ్యతలు అప్పగించాలని సర్కారు డిసైడ్​ అయింది. ఇందులో భాగంగా సర్వే నంబర్ల వారీగా ఆథరైజ్డ్, అన్​ ఆథరైజ్డ్​ లే అవుట్ల  వివరాలను మున్సిపల్, పంచాయతీరాజ్​ శాఖల నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోనుంది. వారు ఇచ్చే లెక్కల​ ఆధారంగానే పెనాల్టీ ఫీజును వసూలు చేయనున్నారు. ఇక అన్​ ఆథరైజ్డ్​ లే అవుట్​లో కొత్త ప్లాట్​(న్యూ ప్లాట్) అంటే నిర్వచనం ఏమిటి ? ఎప్పటి నుంచి పరిగణనలోకి తీసుకోవాలి ? గతంలో రిజిస్ట్రేషన్​ అయి ఉంటే ఎలా అనే లాంటి విషయాలపై  ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2020 ఆగస్టు 26వ తేదీ నుంచి అన్​ ఆథరైజ్డ్​ లే అవుట్​లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు అంతకంటే ముందే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్​ చేసిన వాటిని పరిగణనలోకి తీసుకోవలా వద్దా? అనే దానిపై ఎలాంటి ఆదేశాలు లేవు. దీంతో కొత్త ప్లాటు అంటే ఎప్పటి నుంచి పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై కటాఫ్​ తేదీని నిర్ణయిస్తూ ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది.

2 వేల కోట్ల ఆదాయం టార్గెట్​​  

ఎల్​ఆర్​ఎస్ పెనాల్టీ ద్వారా ఈ మార్చి చివరికల్లా రూ.2 వేల కోట్లు రాబట్టుకోవాలని స్టాంప్​ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖ  టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ లక్ష్యం మేరకు అంచనాలను అందుకోలేకపోయింది. ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల పరిష్కారం, రిజిస్ట్రేషన్లతోనైనా కొంత సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. రెండు నెలల్లో కనీసం 10 లక్షల ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లకు ఆమోదం తెలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇక ఎల్​ఆర్​ఎస్​ పెనాల్టీల అంశానికి వస్తే .. 2020 సెప్టెంబరు 16న ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ పథకానికి సంబంధించి అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుములపై ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది.  మార్కెట్‌‌ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా ఈ పెనాల్టీ మారుతుంది. అనుమతి లేని లేఅవుట్‌‌లో 10 శాతం ఖాళీ స్థలం లేకపోయినప్పటికీ. 

నేరుగా బిల్డింగ్​ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ పెనాల్టీతో పాటు 14 శాతం ఓపెన్‌‌ స్పేస్‌‌ చార్జీ, అదనంగా 33 శాతం కాంపౌండ్‌‌ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ చేయించుకుంటే ఈ 33 శాతం అదనపు పెనాల్టీ ఉండదు.  ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎల్​ఆర్​ఎస్​ కోసం..  మార్కెట్​లో  గజం ధర రూ.3-5 వేల వరకు ఉంటే 30 శాతం, రూ.5–-10 వేల మధ్య ఉంటే 40 శాతం, రూ.10–20 వేల మధ్య ఉంటే 50 శాతం, రూ.20-–30 వేల మధ్య ఉంటే 60 శాతం, రూ.30–50 వేల మధ్య ఉంటే 80 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  

ఇప్పటికే 10 శాతం ప్లాట్లు సేల్​

రాష్ట్ర వ్యాప్తంగా అన్​ ఆథరైజ్డ్​ లే అవుట్​లలో దాదాపు 10 శాతం ప్లాట్లు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీటి రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన ఎల్​ఆర్​ఎస్​ను సబ్మిట్ చేసేందుకు ఓనర్లు, డెవలపర్లు ముందుకురావట్లేదని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. వీటిని ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల కింద వచ్చిన వాటిగానే పరిగణించి.. పెనాల్టీ వసూలు చేసి రిజిస్ట్రేషన్లను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇక రిజిస్ట్రేషన్ల శాఖ ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లను పరిష్కరించేందుకు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లు, నీటి వనరులు (ఎఫ్​టీఎల్), బఫర్​ జోన్​ల దగ్గర ఉన్న వాటిని రెడ్​ లిస్ట్​ చేయాలని.. వీటిపై తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. మిగతా వాటిని గ్రీన్​ లిస్ట్​లోకి తీసుకుని వెంట వెంటనే పరిష్కరించాలనుకుంటున్నది. ఇందుకోసం రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్​ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.