ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండగా, సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల వేతనాలు తప్ప ఎలాంటి సప్లిమెంటరీ బిల్లు అయినా పెండింగ్‌లోనే పడుతోంది. అటు వేతనాలు సకాలంలో రాక, ఇటు బిల్లులు రాక ఉద్యోగులు సతమతం అవుతున్నారు. తమ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 5వ తేదీలోపు రావాల్సిన వేతనాలు ఆయా శాఖలను బట్టి 20వ తేదీ వరకు వస్తున్నాయి.
బిల్లులు పెండింగులో ఉండడంతో వాటి మంజూరు కోసం ఉద్యోగులు, పింఛన్‌దారులు ట్రెజరరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు దాదాపు 10 వేలకు పైగా ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పండుగల అడ్వాన్సుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టుకుంటున్న సరెండర్ లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్‌పై తీసుకునే రుణాలు, పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన అలవెన్సులు, గ్రాట్యుటీ, ఇతరత్రా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాలు కూడా రావడం లేదు. అనారోగ్యం బారిన పడి ఆయా ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని రియింబర్స్‌మెంట్ కోసం పెట్టుకుంటున్న బిల్లులు రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
దీని కింద ఉద్యోగులు అడ్వాన్సుగా కొంత రుణాన్ని తీసుకునే వెసులుబాటు ఉన్నా అది వారి చేతికి అందడం లేదు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మొదటి పీఆర్సీ వేతనాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం అదివరకు ఉన్న గ్రాట్యుటీ సొమ్మును రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు ప్రభుత్వం పెంచింది. కానీ, ఈ పీఆర్సీ రివైజ్డ్ పెన్షన్, గ్రాట్యుటీ రివైజ్డ్ బకాయిలు, పీఆర్సీ ఎరియర్స్ కూడా విడుదల కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కోరుతున్నారు.
పిన్నింటి బాలాజీ రావు