- వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్
- సీఎంఆర్ఎఫ్కు ఒక రోజు వేతనం
- టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు
- తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు
హైదరాబాద్, వెలుగు: వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరుగా వరద సాయం అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఒక రోజు వేతనాన్ని (దాదాపు రూ.130 కోట్లు) వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమారిని కలిసి సమ్మతి పత్రం ఇచ్చారు. కొందరు ఉద్యోగులు మహబూబాబాద్‌లో నేరుగా సీఎం రేవంత్‌ను కలిసి విరాళాల గురించి వివరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఒక నెల వేతనం రూ.2.75 లక్షలను ముంపు బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్కి ఇచ్చారు.
ఆస్తి, ప్రాణ నష్టం.. బాధాకరం: వి.లచ్చిరెడ్డి
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడం బాధాకరమని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. సీఎస్ శాంతి కుమారిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసిందని, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగులు విధుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని, ఇలాంటి సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
విరాళాలు ప్రకటించిన నటులు
టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరుగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఒక్కొక్కరు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. మరో హీరో విశ్వక్ సేన్ రూ.10 లక్షలు, వైజయంతీ మూవీస్ రూ.25 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, చిన్నబాబు కలిసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. హీరో సిద్దు జొన్నలగడ్డ 2 రాష్ట్రాలకు వరద సహాయ నిధికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల విరాళం ప్రకటించారు.