- సన్నాలకు ఊతం .. సన్న వడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం
- క్వింటాల్‌కు రూ. 500 బోనస్
- రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
- ఇన్నాళ్లూ డిమాండ్‌కు తగ్గట్టు లేని సన్నాల సాగు
- ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు
- సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కార్
- ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే చాన్స్.. తగ్గనున్న బియ్యం ధరలు!
హైదరాబాద్, వెలుగు: డిమాండ్‌కు తగ్గట్టుగా సన్న వడ్ల సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. తాజాగా ప్రకటించిన రూ. 500 బోనస్‌తో సన్నవడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపనున్నారని, ఈ సారి వానాకాలం సీజన్లో 50% వరకు వీటి సాగు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గట్లుగా సన్న వడ్ల సాగు జరగడం లేదు. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సన్న బియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని.. సన్నవడ్ల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు రేట్లకు కళ్లెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వర్షాకాలం నుంచి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొంటామని తెలిపింది. కొనుగోలు సెంటర్లలో సన్న వడ్లు సేకరించడం ద్వారా పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసే వీలుంటుంది. దీంతో ఇటు రైతులకు, అటు పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
పడిపోయిన సన్నాల సాగు
కొన్నేండ్లుగా రాష్ట్రంలో సన్నాల సాగు గణనీయంగా పడిపోతున్నది. వానాకాలం 30 శాతం, యాసంగి సీజన్లో 10 నుంచి-15 శాతం మాత్రమే ఈ వడ్లను పండిస్తున్నారు. ఏటా రెండు సీజన్లలో కలిపి 2 కోట్ల 40 లక్షల టన్నులకుపైగా వడ్ల దిగుబడి వస్తున్నప్పటికీ అందులో సన్నాల దిగుబడి అంతంత మాత్రమే. సన్న రకాలు వానాకాలం 20 లక్షల ఎకరాలు, యాసంగిలో 10 లక్షల ఎకరాలకు మించి రైతులు సాగు చేయడం లేదు. దొడ్డు వడ్లనే ఎక్కువగా పండిస్తున్నారు. ఇందుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని రైతు సంఘాల నేతలు అంటున్నారు. సన్నవడ్లు వేసిన రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకాలకు సమానంగానే అమ్ముకోవాల్సింది తప్పితే ప్రత్యేక ధర వెసులుబాటు ఉండేది కాదు. ఫలితంగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే వారు. మిల్లర్లంతా సిండికేట్‌గా మారి తేమ పేరు చెప్పి ధరలు తగ్గించి కొనేవారు.
వానాకాలం 50శాతం పెరిగే చాన్స్
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో కొనాలని నిర్ణయం తీసుకోవడంతో సన్న వడ్ల సాగు వానాకాలంలో 50శాతం, యాసంగిలో 25శాతానికిపైగా పెరిగే అవకాశం ఉంది. సన్న వడ్లు పండించే రైతుకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ లభించనుంది. అంతే కాకుండా మిల్లర్లకు రైతులు సన్నవడ్లు అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి తప్పుతుంది.
నాడు బోనస్ ఇవ్వక..
గత బీఆర్ఎస్ సర్కారు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పి.. దొడ్డు రకం వడ్లు సాగు చేయొద్దని, సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది. నాడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకు చాలా మంది రైతులు ముందుకు వచ్చి సన్న వడ్లను సాగు చేశారు. కానీ నాటి ప్రభుత్వం మాట తప్పింది. బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు. సన్నరకాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ. తెగుళ్ల బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి తక్కువే వస్తుంది. దీనికి తోడు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లు సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలా మంది రైతులు ఆ వైపు వెళ్లడం మానేశారు.