రాష్ట్ర ప్రజా రవాణాలో వీఎల్‌‌‌‌టీడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 రాష్ట్ర ప్రజా రవాణాలో  వీఎల్‌‌‌‌టీడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • నిర్భయ నిధి నుంచి రూ.4 కోట్లు కూడా రిలీజ్
  • మహిళా ప్యాసింజర్ల భద్రతకు రాష్ట్ర సర్కార్ చర్యలు
  • బస్సులు, వ్యాన్లు, ఆటోలు, క్యాబుల్లో డివైజ్ ఏర్పాటు
  • ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుతో అనుసంధానం 

హైదరాబాద్, వెలుగు: మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు అరికట్టేందుకు, రాత్రి వేళ ట్రావెల్ చేసే వారికి మరింత భద్రతను కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్(వీఎల్‌‌‌‌టీడీ)ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల కేంద్ర అనుమతిని కూడా కోరింది. అయితే, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను అనుమతించడమే కాకుండా ‘‘నిర్భయ నిధి’’ నుంచి రాష్ట్రానికి రూ.4.20 కోట్లను విడుదల చేసింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోం శాఖ రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు మంగళవారం పంపింది. 

ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత కేంద్రం ‘‘నిర్భయ నిధి’’ పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది.  దేశ వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణ, సాధికారతకు కేంద్రం ఈ నిధులను రాష్ట్రాలకు పంపిస్తున్నది. ఇటీవల మన రాష్ట్ర బస్సుల్లోనూ మహిళలపై అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటుండంతో వీఎల్‌‌‌‌టీడీ ఏర్పాటుపై రాష్ట్ర రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. కేంద్ర అనుమతితో పాటు నిధులు కూడా రావడంతో పనులను స్పీడప్ చేసింది. 

వీఎల్‌‌‌‌టీడీ ఎలా పని చేస్తుందంటే..!

రాష్ట్రంలోని బస్సులు, వ్యాన్ లు, ఆటోలు, క్యాబ్ లకు వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్(వీఎల్‌‌‌‌టీడీ)లను ఏర్పాటు  చేస్తారు. ఈ డివైజ్ లను ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. దీంతో హైదరాబాద్ సిటీలో ప్రజారవాణాకు సంబంధించిన వాహనాల్లో  ఎక్కడ ఎలాంటి అఘాయిత్యం చోటుచేసుకున్నా కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. ఏ వాహనంలోనైనా అనుకోని సంఘటనలు జరిగితే వీఎల్‌‌‌‌టీడీ ద్వారా  పోలీసులు క్షణాల్లోనే వాహనాన్ని వెంబడించి పట్టుకునే అవకాశం ఉంటుంది. 

బాధితులు ఇచ్చే కనీస సమాచారం ఆధారంగా నేరం జరిగిన వాహనాన్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకునే చాన్స్ ఉంటుంది. ఇలా వీఎల్‌‌‌‌టీడీ.. మహిళల భద్రతకు ఎంతో భరోసానిస్తుంది. మొదట దీన్ని ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆర్టీఏల పరిధిలో అమలు చేయనున్నారు.