- తయారీ బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
- ఒక్కో మండలానికి మూడు యూనిట్లు
- మొత్తంగా1,940 యూనిట్లు అవసరం
- ఒక్కో యూనిట్ కు రూ.18 లక్షల బ్యాంక్ లోన్
- ఒక్కోటి ప్రతి రోజు 2,400 ఇటుకలు తయారు
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల స్కీమ్ లో మహిళా, యువజన సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించనుంది. ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకల తయారీ, సరఫరా బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకు ప్రతి మండలంలో ఇటుకల తయారీ యూనిట్ల ఏర్పాటుకు, సంఘాల ఎంపికకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల్లో సెర్ఫ్, మెప్మాకసరత్తు ప్రారంభించాయి. మహిళా, యువజన సంఘాల డేటాను సేకరించి, ఆసక్తి ఉన్న సంఘాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి.
1,940 యూనిట్లు అవసరం
రాష్ట్రంలో ఒక్కో మండలానికి 3 ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 640 మండలాల్లో 1, 940 యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటుకు ఆసక్తి ఉండి ఎంపికైన సంఘాలకు అవసరమయ్యే మెషీనరీ కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ లేని రూ.18 లక్షలు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
రోజుకు 46.56 లక్షల ఇటుకలు తయారీ
ఒక్కో ఇంటికి 2,250 ఇటుకలు అవసరం పడుతాయని ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకు ఒక్కో యూనిట్ప్రతి రోజు 2, 400 ఇటుకలు తయారు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లు ప్రతి రోజు సగటున 46.56 లక్షల ఇటుకలు అందించాలి. ఒక్కో యూనిట్ప్రతి నెల 25 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 48,500 ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు తయారు చేయాలి.
రెండేండ్లలో పెట్టుబడి పోను..8.40లక్షలు లాభం
ఇటుకల తయారీకి పెట్టుబడి ఖర్చులు పోనూ ఒక్కో ఇటుకకు కనీసం రూ. 2 లాభం వచ్చేలా ఎంపీడీవో లేదా మున్సిపల్చైర్మన్నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో యూనిట్‌ను నిర్వహించే సంఘానికి ప్రతి నెల 1.10 లక్షల చొప్పున రెండేండ్లలో రూ. 26.40 లక్షల లాభం రానుంది. పెట్టిన పెట్టుబడి పోనూ అదనంగా రూ.8.40 లక్షలు లాభం మిగలనుంది.
4.50 లక్షల ఇండ్ల నిర్మాణం
రాష్ట్రంలో ఏడాదికి 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిరుపేదలకు ఇచ్చే ఇండ్లలో ఒక్కోదానికి రూ. 5 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీతో నిర్మించ నుంది. కాగా.. ఇండ్ల నిర్మాణంలో మట్టి ఇటుకల వాడకం తగ్గిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. పైగా పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపడుతున్నందున మట్టి ఇటుకలు లభించే అవకాశాలు లేవని భావించింది. సిమెంట్, ఫ్లైయాస్ తో తయా రయ్యే ఇటుకలను వాడాలని నిర్ణయించింది. వీటి తయారీ, సరఫరాను మహిళా, యువజ న సంఘాలకు బాధ్యతలు అప్పగించి, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసింది.