
- మార్చి 10 వరకు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వన్ మెన్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. మార్చి 10 వరకు గడువు పొడిగిస్తూ ఎస్సీ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసిన కమిషన్.. తన రిపోర్టును ఈ నెల 3న ప్రభుత్వానికి అందజేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలను గ్రూప్ 1, 2, 3 కేటగిరీలుగా విభజించి.. ఏ గ్రూపులో ఎన్ని కులాలు ఉండాలి? ఆ గ్రూపుకు ఎంత రిజర్వేషన్ కేటాయించాలి? అనేది సిఫార్సు చేసింది. గ్రూప్ 1లోని 15 కులాలకు 1%, గ్రూప్ 2లోని 18 కులాలకు 9% , గ్రూప్ 3లోని 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది.
ఈ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే కమిషన్ రిపోర్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో లోపాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీసుకెళ్లారు. కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దీంతో సందేహాల నివృత్తి, రిపోర్టులో సవరణల కోసం కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, పోయినేడాది నవంబర్ 11న వన్ మెన్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. కానీ జనవరి 10 వరకు రిపోర్ట్ రెడీ కాకపోవటంతో ఫిబ్రవరి 10 వరకు కమిషన్ గడువును పెంచింది. ఇప్పుడు మరో నెల పొడిగించింది.