
- రాష్ట్రవ్యాప్తంగా 75.45 లక్షల కార్డులకు పంపిణీ పూర్తి
- 87 శాతం మందికి అందిన సన్న బియ్యం
- మొత్తం 1,57,845 టన్నులు సరఫరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్కీం ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభం కాగా పదిహేను రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 87% మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందాయి. ఇప్పటివరకూ మొత్తం 75 లక్షలకుపైగా రేషన్ కార్డులకు సంబంధించి 2 కోట్లకుపైగా మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది కుటుంబాలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ముందడుగు వేసినట్లయింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని సర్కారు ఆకాంక్షిస్తోంది.
2.27 కోట్ల మందికి పంపిణీ పూర్తి..
రాష్ట్రంలో 90.42 లక్షల రేషన్ కార్డులు ఉండగా దాదాపు 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్13 నాటికి 75.45 లక్షల రేషన్ కార్డులకు సంబంధించిన 2.27 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తయింది. ఈ ప్రక్రియలో ఈ నెల కోటాలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ మొత్తం 1,67,285.599 టన్నుల బియ్యం కేటాయించగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,57,845.610 టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందించారు. ఈ స్కీం కింద సర్కారు అదనంగా రూ.2,858 కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి రేషన్ కార్డు దారునికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. కాగా, సన్న బియ్యం పంపిణీ కోసం రైతుల నుంచి నేరుగా సన్న వడ్లను సర్కారు సేకరించింది. ఈ ప్రక్రియలో రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను అందించింది. గత వానాకాలం సీజన్లో రూ.1,199 కోట్లు ఖర్చు చేసి 4.41లక్షల మంది రైతుల నుంచి 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. దీంతో రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహించినట్లయింది.